న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని-మాజీ పేసర్ ఆర్పీ సింగ్‌లు స్నేహితులన్న సంగతి తెలిసిందే. భారత జట్టు తరఫున ఆడే క్రమంలో వీరిద్దరి మధ్య ఒక స్నేహ పూర్వక వాతావరణం కొనసాగేది. అయితే ఒకానొక సమయంలో ఆర్పీ సింగ్‌ను కచ్చితంగా జట్టులోకి తీసుకోవాలని ధోని పట్టుబట్టాడనే వివాదం చెలరేగింది. 2008లో ఇంగ్లండ్‌తో స్వదేశీ సిరీస్‌లో భాగంగా ఆర్పీ సింగ్ జట్టులో ఉండాలని ధోని సెలక్షన్ కమిటీపై ఒత్తిడి తెచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఒకవేళ ఆర్పీని జట్టులోకి తీసుకోనట్లయితే కెప్టెన్సీ వదులుకోవడానికి కూడా ధోని సిద్ధమయ్యాడంటూ పెద్ద దుమారం చెలరేగింది. ఆ సిరీస్‌లో ఇర్ఫాన్ పఠాన్ స్థానంలో ఆర్పీ సింగ్‌ను తీసుకోవాలని ధోని పట్టుబట్టినట్లు ఆ వార్తల సారాంశం. జట్టు సెలక్షన్‌కు సంబంధించిన సమాచారం లీక్ అయ్యిందంటూ పుష్కరం కాలం నాడు అది పెద్ద వార్త అయ్యింది. అది ఎంత నిజమో తెలీదు కానీ దాన్ని ఆర్పీ సింగ్ తాజాగా ఖండించాడు. (భారత క్రికెటర్లతో టచ్‌లో ఉన్నా: శ్రీశాంత్)
తనను ఎంపిక చేసే విషయంలో కానీ, తాను జట్టులో చోటు కోల్పోవడంలో కానీ ధోని పాత్ర లేదన్నాడు. ఎప్పుడూ ధోని ఆటగాళ్ల సెలక్షన్‌లో పట్టుబట్టిన సందర్భాలు అనేవి లేవన్నాడు. తనను జట్టులోకి తీసుకోవాలని సమాచారం లీక్ అయ్యిందనే వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదన్నాడు. అలా లీక్ కావడం వల్లే తన కెరీర్ ముగిసిపోయిందనేది అర్థంలేని ఆరోపణగా ఆర్పీ పేర్కొన్నాడు. అంతకుముందు ఇండోర్‌లో జరిగిన మ్యాచ్‌లో తాను ఒక వికెట్ కూడా తీయలేదని, దాంతో మరో కొన్ని చాన్స్‌లు మాత్రం ఆశించానన్నాడు. కొంతమందికి నాలుగు-ఐదు, మరికొంతమందికి పది చాన్స్‌లు వస్తుంటాయని, అది వారి అదృష్టాన్ని బట్టి ఉంటుందన్నాడు. తన ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్లే తన కెరీర్ ముందుకు సాగలేదన్నాడు. (టీమిండియా ఫీల్డింగ్ మాతోనే పోయింది!)
2011లో ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా తాను పూర్తిగా విఫలమైన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ఆ సిరీస్ తర్వాత తనను పూర్తిగా పక్కన పెట్టేశారన్నాడు. జట్టుకు దూరమైన ఏడేళ్ల తర్వాత అంటే 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు ఆర్పీ సింగ్ గుడ్ బై చెప్పేశాడు. అయితే తాను భారత్‌కు చాలానే మ్యాచ్‌లు ఆడానని, దానితో సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు. ఏ రోజూ తనను ఎంపిక చేసే విషయంలో కానీ, తప్పించడంలో కానీ ధోని పాత్ర లేదన్నాడు. తమ ఫ్రెండ్‌షిప్‌కు సెలక్షన్‌కు ఎటువంటి సంబంధం లేదన్నాడు. ఇవాళ ధోని గురించి మాట్లాడుకుంటున్నామంటే అతను వివాదాలకు దూరంగా ఉండటం కూడా ఒక కారణమన్నాడు. ఇప్పటికీ ఎప్పటికీ ఎంఎస్ ధోని అంటే ఎంఎస్ ధోనినేనని ఆర్పీ సింగ్ పేర్కొన్నాడు. ఒత్తిడిలో కూడా ధోని తీసుకునే నిర్ణయాలే అతన్ని ఉన్నత స్థానంలో నిలిపాయన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment