
నేటి నుంచి మొయినుద్దౌలా టోర్నీ
►బరిలో 10 జట్లు
►ఎయిరిండియా తరఫున రైనా
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ కాలంగా హైదరాబాద్ క్రికెట్‌లో అంతర్భాగంగా ఉన్న ఆలిండియా మొయినుద్దౌలా గోల్డ్ కప్ క్రికెట్ టోర్నీకి రంగం సిద్ధమైంది. నేటి నుంచి జరిగే ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ నెల 31న ఫైనల్ నిర్వహిస్తారు. సోమవారం జరిగిన మీడియా సమావేశంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్ష, కార్యదర్శులు జి.వివేకానంద్, టి.శేష్ నారాయణ్ టోర్నమెంట్ విశేషాలను వెల్లడించారు. 1930 నుంచి జరుగుతున్న ఈ టోర్నీని ఈ ఏడాది వన్డే ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. మొత్తం 10 టీమ్‌లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. లీగ్ దశలో ఒక్కో జట్టు తమ గ్రూప్‌లోని ప్రత్యర్థులతో నాలుగు మ్యాచ్‌లు ఆడుతుంది. టాప్–2 టీమ్‌లు సెమీస్‌కు చేరతాయి. గ్రూప్ ‘ఎ’లో హెచ్‌సీఏ ఎలెవన్, ఆంధ్ర కోల్ట్స్, కాగ్, గోవా, విదర్భ జట్లు... గ్రూప్ ‘బి’లో హెచ్‌సీఏ ప్రెసిడెంట్స్ ఎలెవన్, ఎయిరిండియా, బరోడా, కేరళ, కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్ జట్లు ఉన్నాయి. ‘తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన ప్రతిభావంతులైన ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు ఈసారి కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్ జట్టును ఆడిస్తున్నాం.
ఈ టీమ్‌తో పాటు హెచ్‌సీఏ తరఫున బరిలోకి దిగుతున్న రెండు జట్లలో కూడా ఆటగాళ్లను పూర్తిగా వారి ప్రతిభ, స్కోర్లను బట్టే ఎంపిక చేశాం. ఈ విషయంలో ఎలాంటి పక్షపాత ధోరణి ప్రదర్శించలేదు’ అని వివేకానంద్ చెప్పారు. టోర్నీలో పాల్గొంటున్న జట్లలో ఎక్కువ మంది వర్ధమాన ఆటగాళ్లే ఉన్నారు. అయితే ఇటీవల భారత జట్టులో చోటు కోల్పోయిన సురేశ్ రైనా ఎయిరిండియా తరఫున బరిలోకి దిగుతున్నాడు. అతనితో పాటు టెస్టు ఆటగాడు జయంత్ యాదవ్, నమన్ ఓజా, రజత్ భాటియా మాత్రమే కాస్త గుర్తింపు ఉన్న క్రికెటర్లు. టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 10 లక్షలు.
‘అసలు’ బంగారాన్ని తీసుకురండి...
మీడియా సమావేశంలో మొయినుద్దౌలా వారసులు ఫక్రుద్దీన్, నిఖత్ కూడా పాల్గొన్నారు. కొన్నేళ్ల క్రితం అసలు గోల్డ్ కప్‌ను ఎవరో దొంగిలించి దాని స్థానంలో నకిలీది ఉంచారని ఆరోపణలు వచ్చాయి. దానిపై పలు విధాలుగా విచారణ జరిపినా అసలేం జరిగిందో మాత్రం తేలలేదు. ఇప్పుడైనా తమ తాతగారు ఇచ్చిన అసలు గోల్డ్ కప్‌ను కనుగొనాలని ఫక్రుద్దీన్ కోరారు. దీంతో పాటు గతంలో ఉన్న విధంగా హెచ్‌సీఏ మొయినుద్దౌలా క్లబ్ జట్టును కూడా పునరుద్ధరించాని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేక్ తగు చర్యలు తీసుకుంటామని, అవసరమైతే అసలు బంగారంతో మరో కప్‌ను సిద్ధం చేస్తామని చెప్పారు.
నేటి మ్యాచ్‌లు
హెచ్‌సీఏ ఎలెవన్(vs)ఆంధ్ర కోల్ట్స్
గోవా(vs) విదర్భ
హెచ్‌సీఏ ప్రెసిడెంట్స్(vs) కేరళ
బరోడా(vs) కంబైన్డ్ డిస్ట్రిక్స్ ఎలెవన్