సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు గచ్చిబౌలి స్పోర్ట్స్ టవర్ క్రీడాకారులకు అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర క్రీడల మంత్రి టి. పద్మారావు బుధవారం ఈ టవర్‌ను పునఃప్రారంభించారు. అనంతరం ఆయన ఈ టవర్‌లోని గదులను, అక్కడి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. అంతర్జాతీయ మిలిటరీ గేమ్స్ (2007) సందర్భంగా గచ్చిబౌలిలోని క్రీడాగ్రామంలో రూ. కోట్లు వెచ్చించి దీన్ని నిర్మించారు. అయితే నిర్మించిన సంస్థతో ఒప్పంద వివాదం, నిర్వహణ కరువవడంతో ఇది పూర్తిగా నిరుపయోగంగా మారింది. తిరిగి తొమ్మిదేళ్ల తర్వాత ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం స్పోర్ట్స్ టవర్‌ను క్రీడాకారుల కోసం నవీకరించింది.
ఇప్పుడు ‘సీఐఎస్‌ఎఫ్ ఆలిండియా పోలీస్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్’ కోసం దీన్ని ఉపయోగించనున్నారు. ఈ పోటీలు ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు గచ్చిబౌలి అథ్లెటిక్స్ స్టేడియంలో జరుగనున్నాయి. ఈ టోర్నీ కోసం 5 స్టార్ సదుపాయాలున్న స్పోర్‌ట్స టవర్‌ను ఇవ్వడం పట్ల సీఐఎస్‌ఎఫ్ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాయి.