
మళ్లీ ఐపీఎల్ కు గ్యారీ కిర్‌స్టెన్!
న్యూఢిల్లీ:టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ తదుపరి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ లో కొత్తగా వచ్చిన రాజ్ కోట్ జట్టుకు కోచ్ వ్యవహరించే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ మేరకు కిర్‌స్టెన్ ను రాజ్ కోట్ యాజమాన్యం సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇటీవల కిర్‌స్టెన్ ను ఢిల్లీ డేర్ డెవిల్స్ కోచ్ పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో గ్యారీని కోచ్ గా తీసుకునేందుకు రాజ్ కోట్ ఆసక్తి కనబరుస్తోంది. అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కోచ్‌గా పేరు తెచ్చుకున్న గ్యారీ.. ఐపీఎల్‌లో మాత్రం ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. 2011 ప్రపంచకప్‌ను భారత్ గెలవడంలో ఆయనదే కీలక పాత్ర అయినా టి 20 ఫార్మాట్‌లో గ్యారీ వ్యూహాలు సాగలేదు. ఇదిలా ఉంచితే గత రెండు సీజన్లలో ఢిల్లీ డేర్ డెవిల్స్ కూడా సమష్టిగా వైఫల్యం చెందిన కారణంగా ఆ భారం కోచ్ గా ఉన్న గ్యారీపై పడింది. దీంతో గ్యారీ కోచ్ పదవికి ఢిల్లీ ఉద్వాసన పలికింది.