
కెప్టెన్సీపై నమ్మకం లేదు
మెల్ బోర్న్:ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో అడపా దడపా స్థానం సంపాదించుకుంటున్న జార్జ్ బెయిలీ తన మనసులోని మాటను తాజాగా బయటపెట్టాడు. ఆస్ట్రేలియా జట్టుకు తాను పూర్తి స్థాయి కెప్టెన్సీ బాధ్యతలు చేపడతానని అనుకోవడం లేదని స్పష్టం చేశాడు. ఈ వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ పై తాత్కాలిక కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన బెయిలీ హాఫ్ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అనంతరం మైకేల్ క్లార్క్ జట్టు పగ్గాలు చేపట్టడంతో బెయిలీకి ఆ తరువాత జట్టులో స్థానం దక్కలేదు.
గత రెండు సంవత్సరాల నుంచి జట్టులోకి వస్తూ పోతూ ఉన్న బెయిలీ.. క్లార్క్ వన్డేలకు వీడ్కోలు చెప్పిన అనంతరం ఆసీస్ కెప్టెన్సీ బాధ్యతలు చేపడతారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా స్టీవ్ స్మిత్ కు ఆసీస్ పగ్గాలు అప్పజెప్పడంతో బెయిల్ స్పందించాడు. ఇప్పటికీ వన్డేల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకోని బెయిల్ తాను ఆసీస్ కు రెగ్యూలర్ కెప్టెన్ గా ఎంపిక అవుతానని అనుకోవడం లేదని తెలిపాడు.