
నాకు అదే గొప్ప విషయం: దీపా కర్మాకర్
తనకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చేతులు మీదుగా గిఫ్ట్ను అందుకోవడమే గొప్ప విషయమని అంటోంది జిమ్నాస్ట్ దీపా కర్మాకర్. రియోలో ప్రదర్శన ఆధారంగా తాను అందుకున్న బీఎండబ్యూ కారును భరించే శక్తి లేదని, అందువల్ల ఆ గిఫ్ట్ ను ఇచ్చేయనున్నట్లు వచ్చిన వార్తలను దీపా ఖండించింది. ఆ కారును తిరిగి ఇచ్చే ఆలోచన లేదని దీపా తాజాగా స్ఫష్టం చేసింది.
'ఆ కారును సచిన్ చేతులు మీదుగా అందుకున్నా. సచిన్ నుంచి ఏ గిఫ్ట్ అందుకున్న అది నాకు గొప్ప విషయమే. అతని నుంచి అందుకున్న గిఫ్ట్ ను ఇచ్చే ఆలోచన నాకు లేదు' అని దీపా పేర్కొంది. తాను కేవలం అగర్తలాలో బీఎండబ్యూ షోరూం లేదని విషయాన్ని మాత్రమే తెలిపినట్లు ఒలింపిక్స్ లో తృటిలో పతకం సాధించే అవకాశాన్ని కోల్పోయిన దీపా పేర్కొంది. దీనిపై హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తో మాట్లాడినట్లు తెలిపింది. ఇటీవల రియో ఒలింపిక్స్ లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా దీపాకు క్రికెట్ దిగ్గజం సచిన్ చేతులు మీదుగా బీఎండబ్యూ కారును అందజేశారు. రియో ఒలింపిక్స్ జిమ్నాస్టిక్‌లో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన దీపకు, సింధు, సాక్షిలతోపాటు బీఎండబ్ల్యూ కారును హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు వీ చాముండేశ్వరినాథ్ బహూకరించిన సంగతి తెలిసిందే.