
కలర్‌ఫుల్
అట్టహాసంగా కామన్వెల్త్
క్రీడల ప్రారంభోత్సవం
తొలుత మార్చ్‌పాస్ట్ చేసిన భారత బృందం
వీడియోలో తలకిందులైన భారత పతాకం
గేమ్స్ ప్రారంభ వేడుకల్లో భారత జాతీయ పతాకానికి అవమానం జరిగింది. కామన్వెల్త్ గేమ్స్ అధికారిక గీతం ‘లెట్ ద గేమ్స్ బిగిన్’ను వీడియో రూపంలో చిత్రీకరించి ప్రారంభ వేడుకల్లో ప్రదర్శించారు. ఇందులో అన్ని దేశాల పతాకాలు కనిపిస్తాయి. అయితే భారత్‌కు సంబంధించిన త్రివర్ణ పతాకాన్ని మాత్రం తలకిందులుగా చూపారు.
గ్లాస్గో: స్కాట్లాండ్ సంస్క ృతి, చారిత్రక నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపుతూ 20వ కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి గ్లాస్గోలోని సెల్టిక్ పార్క్‌లో 40 వేల మంది ప్రేక్షకుల ముందు మూడు గంటలపాటు ఈ కార్యక్రమం జరిగింది. ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్-2 కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభమవుతున్నట్టు ప్రకటించారు.
యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్ హోదాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వీడియో సందేశం ద్వారా అభిమానులను పలుకరించారు. 71 దేశాల నుంచి వచ్చిన 4500 మంది అథ్లెట్లకు స్టేడియంలో ఘన స్వాగతం లభించింది. ఇటీవలి మలేసియా విమాన దుర్ఘటనకు నిమిషం పాటు శ్రద్ధాంజలి ఘటించారు. రాణితో పాటు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్, స్కాటిష్ మంత్రి అలెక్స్ సాల్మండ్, కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య అధ్యక్షుడు ప్రిన్స్ ఇమ్రాన్ టుంకు తదితరులు పాల్గొన్నారు.
►ముందుగా ప్రపంచ ప్రఖ్యాత స్కాటిష్ సింగర్లు రాడ్ స్టివార్ట్, సుసాస్ బోలే తమ పాటలతో హోరెత్తించారు.
► 100 మీ. వెడల్పుతో స్టేడియంలోని దక్షిణ స్టాండ్ ముందు 11మీ. ఎత్తు కలిగిన ఎల్‌ఈడీ భారీ స్క్రీన్ ఆహుతులను మంత్రముగ్ధులను చేసింది.
► స్టేడియం మీదుగా తొమ్మిది జెట్ విమానాలు ఎగురుతూ ప్రేక్షకులను కట్టిపడేశాయి. వందలాది నృత్య కళాకారులు తమ డ్యాన్స్‌లతో ఉర్రూతలుగించారు.
►గత క్రీడలకు ఆతిథ్యమిచ్చిన భారత్ తమ అథ్లెట్లతో ముందుగా మైదానంలోకి అడుగుపెట్టింది. షూటర్ విజయ్ కుమార్ భారత పతాకాన్ని చేతపట్టగా ఇతర అథ్లెట్లు అతడిని అనుసరించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో బాలీవుడ్ సంగీతం వినిపించింది.
►ఆ తర్వాత క్రికెట్ దిగ్గజం సచిన్ కొద్దిసేపు వీడియో ద్వారా తన సందేశాన్ని వినిపించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్నారుల జీవన పరిస్థితులను మెరుగుపరిచేందుకు ఆర్థికంగా సహాయపడాలని యూనిసెఫ్ రాయబారి హోదాలో కోరాడు.
►మలేసియా జట్టు తమ జాతీయ పతాకాన్ని సగం అవనతం చేయగా, ఆ దేశ అథ్లెట్లు నల్ల బ్యాడ్జీలు ధరించారు.
► దేశాల రాక అనంతరం పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు.
►చివర్లో కామన్వెల్త్ బ్యాటన్‌ను జమైకాకు చెందిన చిన్నారి తీసుకురాగా తన నుంచి 32 మంది డెలిగేట్స్ మధ్య చేతులు మారి చివరికి రాయల్ బాక్స్‌కు చేరింది. దీన్ని ఇంగ్లండ్ అథ్లెట్ దిగ్గజం సర్ క్రిస్ హాయ్ సీజీఎఫ్ చీఫ్ ప్రిన్స్ ఇమ్రాన్‌కు అందజేశారు.అనంతరం రాణి ఎలిజబెత్ క్రీడలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు.