హైదరాబాద్: ‘ఒక కోచ్‌గా సైనా, సింధులను ఒకేలా చూస్తా. వీళ్లిద్దరూ రెండు వజ్రాల లాంటి వారు. హైదరాబాద్‌లోని అకాడమీలో ఇద్దరి మధ్య ప్రతీరోజు గెలుపోటములు సహజమే. ఓడినా, గెలిచినా వారిని ప్రోత్సహిస్తూ మరింత ముందుకు వెళ్లాలని సూచిస్తుంటా. టోర్నమెంట్‌లు జరిగే సమయంలో మాత్రం కఠినంగా ఉంటా. నా శిష్యులు ఒలింపిక్ స్వర్ణం గెలవడమే నా లక్ష్యం’ అని కోచ్ పుల్లెల గోపీచంద్ గత నెల్లో చెప్పిన మాట. అయితే ప్రస్తుతం వీరిద్దరికీ వేర్వేరుగా శిక్షణ ఇవ్వడం చర‍్చనీయాంశమైంది. కామన్‌వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించి తిరిగి వచ్చిన సైనా, సింధూలకు కోచ్ గోపిచంద్ రెండు వేర్వేరు అకాడమీల్లో శిక్షణ ఇస్తున్నారు.
దీనిపై జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ మాట్లాడుతూ.. ‘వీరికి వేర్వేరుగా శిక్షణ ఇవ్వాలని కోచింగ్ బృందం నిర్ణయించింది. గతంలో వేర్వేరు షెడ్యూళ్లలో సైనా, సింధూలకు శిక్షణ ఇచ్చాం. క్రీడాకారిణుల ఆసక్తి, మా కోచింగ్ జట్టు నిర్ణయంతో వారికి వేర్వేరు అకాడమీల్లో శిక్షణ ఇస్తున్నాం’ అని పేర్కొన్నారు. అయితే హైదరాబాద్‌లోని అకాడమీలో ఇద్దరి మధ్య ప్రతీరోజు గెలుపోటములు సహజమేనని నెలరోజుల క్రితమే వ్యాఖ్యానించిన గోపీచంద్.. ఇంతలోనే వారికి వేర్వేరుగా శిక్షణ ఇవ్వడం ఏమిటనేది అభిమానుల ప్రశ్న.
వేర్వేరుగా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసినా సైనా-సింధులకు విడిగా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది. ఒకేచోట శిక్షణ ఇస్తే వారు మరింతగా రాటుదేలే అవకాశం ఉంటుంది కదా. సైనా-సింధులకు పొసగడం లేని కారణంగానే వేర్వేరు శిక్షణకు దారి తీసి ఉండవచ్చనే వాదన వినిపిస్తోంది. ఏది ఏమైనా ‘ఒక వరలో రెండు కత్తులు ఇమడవు’ అనే సామెత కూడా వారికి సెపరేట్‌గా శిక్షణ ఇవ్వడంతో మరోసారి నిజమైంది. 2014 సెప్టెంబరులో సైనా.. గోపిచంద్ అకాడమీని వదలి బెంగళూరులోని విమల్ కుమార్ వద్ద శిక్షణ పొందింది. కాగా, గత ఏడాది సైనా నెహ్వాల్ తిరిగి గోపీచంద్ గూటికి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment