
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి క్రీడలకు రూ. 2,826.92 కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే పెరిగింది స్వల్పమే. రూ. 50 కోట్లే ఎక్కువగా కేటాయించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ‘ఖేలో ఇండియా’కు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే మిగతా క్రీడా సమాఖ్యలు, క్రీడా సంబంధిత రంగాలకు కేటాయింపుల్లో కోత విధించారు. గత బడ్జెట్‌లో ‘ఖేలో ఇండియా’కు రూ. 578 కోట్ల నిధులు ఇవ్వగా... ఈ సారి దానిని రూ.890.42 కోట్లకు పెంచారు. గతంతో పోల్చుకుంటే రూ. 312.42 కోట్ల పెరుగుదల కనిపించింది. ఒలింపిక్ ఏడాదిలో క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహకాల నిధుల్ని తగ్గించడం ఆశ్చర్యకరం. రూ. 111 కోట్ల నుంచి రూ. 70 కోట్లకు కుదించారు.
అలాగే జాతీయ క్రీడాభివృద్ధి నిధి (ఎన్‌ఎస్‌డీఎఫ్)కి గతంలో రూ.77.15 కోట్లు ఇవ్వగా... ఇప్పుడు రూ. 50 కోట్లతో సరిపెట్టారు. ఇక జాతీయ క్రీడా సమాఖ్యల కోసం రూ. 245 కోట్లను కేటాయించారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన రూ. 300.85 కోట్లతో పోల్చితే రూ. 55.8కోట్లు కోత పెట్టారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కీ కోత తప్పలేదు. రూ. 500 కోట్లు (గతంలో రూ. 615 కోట్లు) కేటాయించారు. కామన్వెల్త్ గేమ్స్ (2010) ‘సాయ్’ స్టేడియాల నవీకరణకు రూ.75 కోట్లు విదిల్చారు. గత మొత్తం రూ. 96 కోట్లతో పోల్చితే రూ. 21 కోట్లు తగ్గింది. క్రీడాకారుల సంక్షేమ నిధి (రూ. 2 కోట్లు)లో ఏ మార్పు లేదు. జమ్మూ కశ్మీర్‌లో క్రీడా సదుపాయాల కోసం గత బడ్జెట్‌లో కేటాయించిన రూ. 50 కోట్ల మొత్తాన్నే ఈ సారీ కొనసాగించారు. లక్ష్మీబాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌కు మాత్రమే కాస్త హెచ్చింపు చేశారు. రూ. 55 కోట్లకు పెంచారు. గతం కంటే రూ. 5 కోట్లు పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment