అవకాశం ఇచ్చిన వారిద్దరికీ థ్యాంక్స్
బెంగళూరు: చాలా రోజుల తర్వాత విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన కోల్కతా నైట్రైడర్స్ బ్యాట్స్మన్ యూసుఫ్ పఠాన్.. టీమ్ హెడ్ కోచ్ జాక్వెస్ కలిస్, అసిస్టెంట్ కోచ్ సిమోన్ కటిచ్లకు ధన్యవాదాలు చెబుతున్నాడు. తనపై విశ్వాసం ఉంచి, మధ్య ఓవర్లలో ఆడే అవకాశం ఇచ్చారని సంతోషం వ్యక్తం చేశాడు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో కోల్కతా విజయం సాధించడంలో యూసుఫ్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. యూసుఫ్ 29 బంతుల్లో 60 పరుగులతో అజేయంగా నిలవడంతో కోల్కతా మరో ఐదు బంతులు మిగిలుండగా ఐదు వికెట్లతో గెలుపొందింది. ఈ విజయం గురించి యూసుఫ్ మాట్లాడుతూ.. 'ఇన్నింగ్స్లో మరో రెండు లేదా మూడు ఓవర్లు మిగిలివున్నపుడు వెళ్లి బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. ప్రతి బంతికి భారీ షాట్లు ఆడాల్సి ఉంటుంది. నిలకడగా ఆడే పరిస్థితి ఉండదు. బెంగళూరుతో మ్యాచ్లో ఇంకా పది ఓవర్లు ఉన్నప్పుడు నన్ను బ్యాటింగ్కు పంపారు. నాపై నమ్మకం ఉంచి, అవకాశం ఇచ్చిన కలిస్, కటిచ్లకు కృతజ్ఞతలు' అని చెప్పాడు. కోల్కతా కెప్టెన్ గంభీర్ గురించి మాట్లాడుతూ.. అతను మంచి కెప్టెన్ అంటూ కితాబిచ్చాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా గంభీర్ ఆటగాళ్లకు అండగా ఉంటూ, ప్రోత్సహిస్తాడని చెప్పాడు.