సిడ్నీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ ప్రశంసలు కురిపించాడు. తాను చూసినంత వరకూ క్రికెట్ చరిత్రలో ధోనినే పవర్‌ఫుల్ బ్యాట్స్‌మన్ అంటూ కొనియాడాడు. దీనిలో భాగంగా ధోని ఆడిన కొన్ని అరుదైన ఇన్నింగ్స్‌లను చాపెల్ గుర్తు చేసుకున్నాడు. ధోని అంతర్జాతీయ కెరీర్ ఆరంభించిన తొలి నాళ్లలో భారత్ కోచ్‌గా చాపెల్ వ్యవహరించాడు. ఆనాటి విశేషాలను ‘ప్లేరైట్ ఫౌండేషన్’ నిర్వహించిన ఆన్‌లైన్ చాట్‌లో పంచుకున్న చాపెల్..ధోనిని ఆకాశానికెత్తేశాడు. క్రికెట్ చరిత్రలో ధోనినే పవర్‌ఫుల్ బ్యాట్స్‌మన్ అంటూ కీర్తించాడు. ఈ మేరకు 2005లో శ్రీలంకపై ధోని సాధించిన 183 పరుగుల్ని నెమరవేసుకున్నాడు. ఈనాటికి ధోని అత్యధిక వన్దే స్కోరుగా ఉన్న అది ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ అని పేర్కొన్నాడు. (కోహ్లి సాధిస్తాడా!.. అనుమానమే?)
‘క్రికెట్ చరిత్రలో ఎంఎస్ ధోని మించి బంతిని బలంగా బాదే ఆటగాడు మరొకరు లేరు. అతడు జట్టులోకి వచ్చిన కొత్తలోనే ఓ మంచి ఆటగాడిని ప్రపంచం చూడబోతుందని భావించా. అందుకు తగ్గట్లే అతడు కెరీర్ తొలినాళ్లలోనే శ్రీలంకపై 183 పరుగులు చేసి సత్తాచాటుకున్నాడు. ఆ మ్యాచ్‌లో అతడాడిన షాట్లకు నేను ఫిదా అయ్యాను. అది జైపూర్‌లో జరిగిన మ్యాచ్. ఆ తర్వాత పుణెలో మ్యాచ్ జరిగింది. అందులో భారీ షాట్లు ఆడాల్సి అవసరం లేదు. సాధారణ స్కోరు మాత్రమే మన ముందుంది. ధోని క్రీజ్‌లోకి వెళ్లే సమయానికి మాకు 80 నుంచి 100 పరుగులు మాత్రమే చేయాలి అనుకుంటా. అప్పుడు ధోనితో చెప్పా. గ్రౌండ్ నలుమూలలకు ఆడుతూ స్టైక్ రొటేట్ చేయమన్నా. (‘కెప్టెన్సీ పంచుకోవడం కోహ్లికి నచ్చదు’)
అప్పుడు ధోని తన హిట్టింగ్‌ను వదిలేసి సింగిల్స్, డబుల్స్‌తో స్కోరు బోర్డును నడిపించాడు. భారత విజయానికి 17 పరుగులు కావాల్సిన తరుణంలో ధోని బ్యాట్ ఝుళిపించాడు. వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి మ్యాచ్‌ను 26 బంతులు ఉండగానే ముగించాడు. ధోని కెరీర్ ఆద్యంతం హిట్టింగ్‌పైనే ఆధారపడి ఉంటే చాలా కోల్పోయేవాడు. పరిస్థితులు తగ్గట్టు ఆడటం అలవాటు చేసుకున్నాడు కాబట్టే ధోని గ్రేట్ బ్యాట్స్‌మన్ అయ్యాడు.. అదే సమయంలో బెస్ట్ ఫినిషర్ అయ్యాడు. ధోని బంతిని బలంగా కొట్టేంతగా మరే క్రికెటర్ కొట్టడం నేను ఇంతవరకూ చూడలేదు. ఆనాటి నా సలహా ధోనిని గ్రేట్ ఫినిషర్‌గా మార్చేందనే అనుకుంటున్నా’ అని చాపెల్ పేర్కొన్నాడు. లంకేయులతో పుణె మ్యాచ్‌లో ధోని 43 బంతుల్లో 45 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో ఒక ఫోర్, రెండు సిక్స్‌లు మాత్రమే ఉన్నాయి. అది మ్యాచ్ ఫినిష్ చేసే క్రమంలో కొట్టినవే. శ్రీలంక నిర్దేశించిన 262 పరుగుల ఛేదనను భారత్ 45.4 ఓవర్లలో ఛేదించింది.
Comments
Please login to add a commentAdd a comment