రాజ్కోట్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ లయన్స్ 150 పరుగుల సాధారణ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత గుజరాత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ ఆదిలోనే బ్రెండన్ మెకల్లమ్(1), డ్వేన్ స్మిత్(15) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.అనంతరం ఆరోన్ ఫించ్(5) కూడా నిష్రమించడంతో గుజరాత్ 24 పరుగుల వద్ద మూడో వికెట్ ను నష్టపోయింది.
ఆ తరుణంలోసురేష్ రైనా-దినేష్ కార్తీక్ జోడి మరమ్మత్తులు చేపట్టింది. ఈ జోడీ 51 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన అనంతరం రైనా(24) నాల్గో వికెట్ గా అవుటయ్యాడు. అయితే దినేష్ కార్తీక్(53;43 బంతుల్లో 5 ఫోర్లు) బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేయడంతో గుజరాత్ తేరుకుంది. ఆపై రవీంద్ర జడేజా(36 నాటౌట్; 26 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్) రాణించడంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో నదీమ్ కు రెండు వికెట్లు సాధించగా, క్రిస్ మోరిస్,జహీర్ ఖాన్, మహ్మద్ షమీ, అమిత్ మిశ్రాలు తలో వికెట్ తీశారు.