
మందేసాడు... మెడల్ ఇచ్చేశాడు!
స్వర్ణపతక విజేత నిర్వాకం
బీజింగ్ : అతను గెలిచింది సాదాసీదా ఈవెంట్‌లో కాదు... ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం. దాని విలువేమిటో అతనికి చాలా బాగా తెలుసు. అయితే ఆనందంలో మందు ఎక్కువై ఏకంగా ట్యాక్సీ డ్రైవర్‌కే దానిని కుదువ పెట్టేశాడు ఆ ఘనుడు! వరల్డ్ చాంపియన్‌షిప్ సందర్భంగా బీజింగ్‌లో సోమవారం ఈ ఘటన జరిగింది. పురుషుల హ్యామర్ త్రోలో 80.88 మీటర్ల దూరం గుండు విసిరి పావెల్ ఫాజ్‌డెక్ (పోలండ్) స్వర్ణం సొంతం చేసుకున్నాడు. 26 ఏళ్ల పావెల్ ఈ ఆనందంలో రాత్రంతా పబ్‌లో ఫుల్‌గా తాగి ఎంజాయ్ చేశాడు. అదే మత్తులో బయటికి వచ్చి ట్యాక్సీ ఎక్కిన అతను తన హోటల్‌కు చేరాడు.
అయితే టాక్సీ డ్రైవర్‌కు డబ్బుకు బదులుగా తన గోల్డ్ మెడల్ ఇచ్చేసి పండగ చేస్కోమన్నాడు! ఉదయం మత్తు దిగిన తర్వాత చూస్తే మెడల్ కనబడకపోవడంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. స్థానిక పోలీసులు ఫాజ్‌డెక్ చెప్పిన వివరాలను బట్టి రోజంతా గాలించి ఆ డ్రైవర్‌ను పట్టుకోగలిగారు. నేనేం చేయను, అతను ఇస్తే తీసుకున్నాను...కొట్టేయలేదు కదా అంటూ డ్రైవర్ ఘాటుగా జవాబిచ్చాడు! చివరకు అతనికి ట్యాక్సీ డబ్బులు ఇచ్చి పోలీసులు స్వర్ణ పతకాన్ని పోలండ్ ఆటగాడికి అందించారు. ఎలాగైతేనేం మెడల్ దక్కిందంటూ ఫాజ్‌డెక్ లెంపలేసుకున్నాడు.