
గాయంతో మైదానం వీడుతున్న ఇషాన్.. పాండ్యా టెన్షన్
ముంబై : రాయల్‌చాలెంజర్స్ బెంగళూరుతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తీవ్రంగా గాయపడి మైదానం వీడిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో బంతిని విసిరిన హార్ధిక్ పాండ్యా తెగ టెన్షన్ పడ్డాడు.
అసలేం జరిగిందంటే.. ఆర్సీబీ ఇన్నింగ్స్.. బుమ్రా వేసిన 13వ ఓవర్‌లో స్ట్రైకింగ్‌లో ఉన్న కోహ్లి మిడ్‌వికెట్ మీదుగా వచ్చిన బంతిని షాట్ ఆడాడు. ఫ్రంట్ ఫీల్డర్ అద్భుత డైవ్‌తో బంతిని ఆపే ప్రయత్నం చేయగా.. అది కొంత దూరం వెళ్లింది. అయితే బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న పాండ్యా పరుగెత్తుకుంటూ వచ్చి అదే వేగంతో బంతని వికెట్‌కీపర్‌కు విసిరాడు. ఈ బంతి అనూహ్యంగా బౌన్స్ అయి ఇషాన్‌కు తగిలింది. ఈ సమయంలో అతను హెల్మెట్ ధరించకపోవడంతో బంతి నేరుగా కుడి కనుబొమ్మకు తగిలింది. దీంతో అతను విలవిలలాడుతూ మైదానంలో కుప్పకూలిపోయాడు. వెంటనే ముంబై జట్టు వైద్య సిబ్బంది అతన్ని మైదానం నుంచి తీసుకెళ్లారు. ఇక కిషాన్ స్థానంలో రంజీ ఆటగాడు ఆదిత్య తారే కీపింగ్ చేశాడు.
ఈ ఆకస్మిక ఘటనతో మైదానంలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే బంతి విసిరిన పాండ్యా మాత్రం తెగ భయపడ్డాడు. అతనికి తీవ్రంగా గాయమైందేమోనని ఆందోళన చెందాడు. ఈ విషయం టీవీ కెమెరాల్లో స్పష్టం అయింది. అయితే ఈ వ్యవహారంలో పాండ్యా తప్పులేకున్నా.. తన వల్ల ఓ ఆటగాడు గాయపడ్డాడని ఈ ఆలౌరౌండర్ తీవ్ర మదనపడ్డాడు. అదృష్టవశాత్తు బంతి కనుబొమ్మకు తగలడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కన్నుకు తగిలి ఉంటే ఇషాన్ కెరీర్ ప్రశ్నార్థకంలో పడేదని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
తదుపరి మ్యాచ్‌కు కోలుకుంటాడు : రోహిత్ శర్మ
గాయపడ్డ ఇషాన్ తదుపరి మ్యాచ్‌కు కోలుకుంటాడని మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘దురదృష్టవశాత్తు.. వ్యక్తిగతంగా అతన్ని పరీక్షంచలేదు. మ్యాచ్ ప్రజంటేషన్ కోసం ఇక్కడకు వచ్చాను. అతని కుడి కన్నుకు కొంచెం వాపు వచ్చింది. రేపటి కల్లా అంతా సర్థుకుంటుంది. మేం మా తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్ 22న ఆడనున్నాం. ఇంకా మూడు, నాలుగు రోజుల సమయం ఉంది. కాబట్టి అప్పటిలోపు అతను కోలుకుంటాడు.’ అని రోహిత్ పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో ముంబై 46 పరుగుల తేడాతో ఆర్సీబీపై విజయం సాధించి ఈ సీజన్‌లో ఖాతా తెరిచింది.
Comments
Please login to add a commentAdd a comment