మెరుగైన స్థితిలో దక్షిణాఫ్రికా
♦ తొలి ఇన్నింగ్స్‌లో 353/3
♦ ఆమ్లా అజేయ శతకం
♦ ఇంగ్లండ్‌తో రెండో టెస్టు
కేప్‌టౌన్: హాషిం ఆమ్లా, డివిలియర్స్ బాధ్యతాయుత బ్యాటింగ్ కారణంగా.... ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా మెరుగైన స్థితిలో నిలిచింది. మ్యాచ్ మూడో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసింది. హషీం ఆమ్లా (371 బంతుల్లో 157 బ్యాటింగ్: 21 ఫోర్లు) టెస్టు కెరీర్‌లో 24వ సెంచరీ పూర్తి చేసుకోగా... డివిలియర్స్ (211 బంతుల్లో 88; 12 ఫోర్లు, 1 సిక్స్) శతకం కోల్పోయాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 183 పరుగులు జోడించడం విశేషం.
ప్రస్తుతం ఆమ్లాతో పాటు డు ప్లెసిస్ (115 బంతుల్లో 51; 6 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నాడు.
ఈ జోడి నాలుగో వికెట్‌కు అభేద్యంగా 85 పరుగులు జత చేసింది. ప్రస్తుతం చేతిలో 7 వికెట్లు ఉన్న దక్షిణాఫ్రికా మరో 276 పరుగులు వెనుకబడి ఉంది. 141/2 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఆమ్లా, డివిలియర్స్ జాగ్రత్తగా ఆడారు. ఇంగ్లండ్ ఆటగాళ్ల ఫీల్డింగ్ వైఫల్యాలు కలిసి రావడంతో వీరిద్దరు మూడు సార్లు అవుటయ్యే ప్రమాదంనుంచి తప్పించుకున్నారు.
50 పరుగుల వద్ద డివిలియర్స్ టెస్టుల్లో 8 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. జాక్ కలిస్, గ్రేమ్ స్మిత్‌ల తర్వాత ఈ ఘనత సాధించిన మూడో దక్షిణాఫ్రికా ఆటగాడు డివిలియర్స్. మరో వైపు 93 పరుగుల వద్ద ఆమ్లా కూడా 7 వేల పరుగుల మైలురాయిని చేరుకోవడం మూడో రోజు ఆటలో విశేషం.
నాలుగో రోజు ఆట మధ్యాహ్నం గం. 2.00 నుంచి టెన్ క్రికెట్‌లో ప్రత్యక్ష ప్రసారం