'టాప్'లో నిలవడమే నా లక్ష్యం..
హైదరాబాద్:గత కొంతకాలంగా తన ప్రదర్శన నిలకడగా సాగడానికి రియోలో సాధించిన రజత పతకమే కారణమని బ్యాడ్మింటన్ స్టార్, హైదరాబాద్ అమ్మాయి పివి సింధు స్పష్టం చేసింది. రియోలో ప్రదర్శన కారణంగానే తనలో ఆత్మవిశ్వాసం పెరిగినట్లు సింధు తెలిపింది. అలా వచ్చిన ఉత్సాహంతోనే నిలకడగా విజయాలు సాధిస్తున్నట్లు పేర్కొన్న సింధు.. ఎప్పుడూ అత్యుత్తమ ప్రతిభ కనబరచడం అంత సులభం కాదని అభిప్రాయపడింది.
తాను కెరీర్ బెస్ట్ ర్యాంకు ఆరో స్థానంలో నిలిచినందుకు చాలా సంతోషంగా ఉందని, అయితే ఈ స్థాయిని కాపాడుకోవడానికి ప్రయత్నించడమే తన ముందున్న కర్తవ్యమని పేర్కొంది. అయితే వరల్డ్ నంబర్ వన్ ర్యాంకును సాధించడమే తన గోల్ అని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చిన సింధు.. ఇక నుంచి ప్రతీ గేమ్ను మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.