స్విస్ ఓపెన్‌పై సైనా గురి
బాసెల్ (స్విట్జర్లాండ్): ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో నిరాశపరిచిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తనకు కలిసొచ్చిన స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 2011, 2012లలో ఈ టోర్నీ టైటిల్ నెగ్గిన సైనా గతేడాది సెమీఫైనల్లో నిష్ర్కమించింది.
మంగళవారం మొదలయ్యే ఈ టోర్నీలో తొలి రోజు పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్‌లతోపాటు మిక్స్‌డ్ డబుల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్, పురుషుల డబుల్స్ విభాగాలలో క్వాలిఫయింగ్ పోటీలు నిర్వహిస్తారు. పురుషుల సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్... మహారాష్ట్ర ప్లేయర్ ఆనంద్ పవార్ బరిలో ఉన్నారు.
తొలి రౌండ్‌లో హుర్స్‌కెనైన్ (స్వీడన్)తో శ్రీకాంత్; కాక్ పోంగ్ లోక్ (మలేసియా)తో ఆనంద్ పవార్; మిజెస్ (నెదర్లాండ్స్)తో కశ్యప్ ఆడతారు. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో క్వాలిఫయర్‌తో సైనా... షిజియాన్ వాంగ్ (చైనా)తో సైలి రాణే తలపడతారు. పి.వి.సింధుతో ఆడాల్సిన బీట్‌రిజ్ (స్పెయిన్) వైదొలగడంతో ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మాయికి ‘వాకోవర్’ లభించే అవకాశముంది. అంతా అనుకున్నట్లు జరిగితే క్వార్టర్స్‌లో టాప్ సీడ్ యిహాన్ వాంగ్ (చైనా)తో సైనా; షిజియాన్ వాంగ్‌తో సింధు తలపడే అవకాశముంది. డబుల్స్ తొలి రౌండ్‌లోహెరిచ్-కార్లా నెల్టి (జర్మనీ) జోడితో జ్వాల-అశ్విని పొనప్ప జంట తలపడుతుంది.