All England Open
-
BWF Rankings: కెరీర్ బెస్ట్.. తొలిసారి టాప్–10లోకి లక్ష్య సేన్
BWF Rankings: భారత బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ లక్ష్య సేన్ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ రన్నరప్‌తో టాప్–10 ర్యాంకింగ్స్‌లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య విడుదల చేసిన పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 20 ఏళ్ల లక్ష్య సేన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని కెరీర్ బెస్ట్ 9వ ర్యాంక్‌కు ఎగబాకాడు. ఇక మహిళల డబుల్స్‌లో నిలకడగా రాణిస్తోన్న పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ 12 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 34వ ర్యాంక్‌ను అందుకుంది. చదవండి: క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త నిర్ణయానికి 30 ఏళ్లు.. -
సింధు... మరో ‘సారీ’
ప్రతిష్టాత్మక టోర్నీల్లో పతకాలు గెలిచిన పూసర్ల వెంకట సింధుకు ఎందుకనో ఆల్ ఇంగ్లండ్ కలిసిరావడం లేదు. ఈ ఏడాదీ ఆమె పతకం లేకుండానే నిష్క్రమించింది. ప్రిక్వార్టర్స్‌లో ఆరో సీడ్ సింధు 19–21, 21–16, 17–21తో సయాక టకహషి (జపాన్) చేతిలో పరాజయం పాలైంది. సైనా నెహ్వాల్ 14–21, 21–17, 17–21తో రెండో సీడ్ యామగుచి (జపాన్) చేతిలో ఓడింది. ఫలితం నిరాశపరిచినప్పటికీ మాజీ ప్రపంచ నంబర్‌వన్ ఈ మ్యాచ్‌లో తన ఆటతీరుతో ఆకట్టుకుంది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో పుల్లెల గాయత్రీ–ట్రెసా జాలీ తొలి గేమ్ కోల్పోయి రెండో గేమ్‌లో దూసుకెళుతుండగా 18–21, 19–14 స్కోరువద్ద ఆరో సీడ్ ప్రత్యర్థి జోడీ గ్రేసియా–అప్రియని (ఇండోనేసియా) రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగింది. దీంతో భారత జోడీ ముందంజ వేసింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీ 21–7, 21–7తో మార్క్ లామ్స్‌ఫుజ్–మార్విన్ సీడెల్ (జర్మనీ) ద్వ యంపై ఏకపక్ష విజయాన్ని సాధించింది. కేవలం 27 నిమిషాల్లోనే భారత జంట మ్యాచ్‌ను ముగించింది. -
సెమీస్‌లో సింధు
బర్మింగ్‌హామ్: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం 75 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 16–21, 21–16, 21–19తో అకానె యామగుచి (జపాన్)పై విజయం సాధించింది. నేడు జరిగే సెమీఫైనల్లో చోచువోంగ్ (థాయ్‌లాండ్)తో సింధు ఆడుతుంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ (భారత్) 17–21, 21–16, 17–21తో మార్క్ కాలివు (నెదర్లాండ్స్) చేతిలో... మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) 22–24, 12–21తో సెలానీ–చెరిల్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయారు. -
క్వార్టర్స్‌లో సింధు, సైనా నిష్క్రమణ
బర్మింగ్‌హామ్: 20 ఏళ్లుగా భారత షట్లర్లను అందని ద్రాక్షలా ఊరిస్తోన్న ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్న పీవీ సింధు ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. ఈ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన మహిళల ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 21–8, 21–8తో క్రిస్టోఫర్సెన్ (డెన్మార్క్)పై సునాయస విజయాన్ని నమోదు చేసి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. కేవలం 25 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో పూర్తి ఆధిపత్యం కనబర్చిన సింధు... ప్రత్యర్థిని ఏ దశలోనూ పుంజుకోనివ్వకుండా వరుస గేముల్లో మ్యాచ్‌ను ముగించేసింది. అయితే మరో టాప్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు తొలిరౌండ్లోనే చుక్కెదురైంది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మ్యాచ్‌లో సైనా గాయంతో మధ్యలోనే వైదొలిగింది. మియా బ్లిచ్‌ఫెల్డ్ (డెన్మార్క్)తో జరిగిన ఈ పోరులో సైనా 8–21, 4–10తో వెనుకబడి ఉన్న తరుణంలో తప్పుకుంది. పురుషుల ప్రిక్వార్టర్స్‌లో లక్ష్యసేన్ 21–18, 21–17తో థామస్ రౌక్సెల్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. అయితే ఇతర భారత షట్లర్లు భమిడిపాటి సాయిప్రణీత్, హెచ్ఎస్ ప్రణయ్‌లకు మాత్రం ప్రిక్వార్టర్స్‌లో నిరాశే ఎదురైంది. సాయిప్రణీత్ 21–15, 12–21, 12–21తో విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో... ప్రణయ్ 15–21, 14–21తో కెంటో మొమోటా (జపాన్) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో అశ్విని పొన్నప్ప– సిక్కి రెడ్డి (భారత్) ద్వయం 21–17, 21–10తో గాబ్రియెల్ స్టోయేవా– స్టెఫాని స్టోయేవా (బల్గేరియా) జంటపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్ పోరుల్లో సాత్విక్ సాయిరాజ్– అశ్విని పొన్నప్ప (భారత్) జోడీ 19–21, 9–21తో యుకీ కనెకొ– మిసాకి మత్సుటోటోమో (జపాన్) ద్వయం చేతిలో, ప్రణవ్ చోప్రా–సిక్కి రెడ్డి (భారత్) ద్వయం 15–21, 17–21తో రాస్మస్ స్పెర్సెన్–క్రిస్టిన్ బుష్ (డెన్మార్క్) జంట చేతిలో ఓడి ఇంటిదారి పట్టాయి. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 16–21, 21–11, 17–21తో కిమ్ అస్త్రుప్–ఆండ్రెస్ స్కరుప్ రస్ముస్సెన్ (డెన్మార్క్) జంట చేతిలో ఓడింది. మరో వైపు టోర్నీ నుంచి ఇండోనేసియా జట్టు తప్పుకుంది. ఆ జట్టు ప్రయాణించిన విమానంలోనే ఉన్న ఒకరు కరోనా పాజిటివ్‌గా తేలడంతో... టీమ్‌ను 10 రోజుల పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలంటూ టోర్నీ నిర్వాహకులు ఆదేశించారు. -
ఆ టోర్నీ నిర్వాహకులపై సైనా ఫైర్
హైదరాబాద్ : ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ -2020 నిర్వాహకులపై భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న వేళ .. టోర్నీ నిర్వహించడంపై విమర్శలు గుప్పించారు. ఆటగాళ్ల సంక్షేమం, భావాలు పట్టించుకోకుండా.. కేవలం డబ్బుల కోసమే వారు టోర్నీని నిర్వహించారని ఆమె అన్నారు. అంతకుమించి ఆల్ ఇంగ్లండ్ ఓపెన్-2020 నిర్వహించడానికి ఒక్క కారణం కూడా లేదని అన్నారు. ట్విటర్లో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ నిర్వహణకు సంబంధించి డెన్మార్క్ ఆటగాడు మాడ్స్ కాన్రాడ్ పీటర్సన్ చేసిన ట్విట్‌పై సైనా ఈ విధంగా స్పందించారు. ‘ఓవైపు కరోనా భయంతో ప్రపంచం అంతా మూత పడుతుంటే.. సాధారణ పరిస్థితుల మధ్య నేను ఆల్ ఇంగ్లండ్ టోర్నీ ఆడటంతో భయమేస్తుంది. 14 రోజుల పాటు నేను అనారోగ్యంగానే ఉన్నానని భావించాల్సి ఉంటుంది’ అని మాడ్స్ ట్వీట్ చేశారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఆందోళనల నేపథ్యంలో పెద్ద పెద్ద క్రీడా ఈవెంట్లను రద్దు చేయడమో, వాయిదా వేయడమో లేక ప్రేక్షకులను అనుమతించకుండా నిర్వహించడమో చేస్తున్నారు. కానీ బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌ను సాధారణ పరిస్థితుల మధ్యనే నిర్వహించారు. Only thing I can think of is that rather than the players welfare n feelings , financial reasons were given more importance. Otherwise there was no other reason for the #AllEnglandOpen2020 to go on last week .. #QuarantineLife https://t.co/yajkj7M7VX — Saina Nehwal (@NSaina) March 18, 2020 చదవండి : సైనా పయనం ఎంతవరకు? -
క్వార్టర్స్‌లో సింధు
బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్, ప్రపంచ చాంపియన్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టింది. గురువారం జరిగిన మహిళల ప్రిక్వార్టర్స్ పోరులో సింధు 21–19, 21–15తో సుంగ్ జి హ్యూన్ (దక్షిణ కొరియా)పై వరుస గేముల్లో విజయం సాధించింది. తొలి గేమ్‌లో సింధుకు ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైంది. 19–19తో సమానంగా ఉన్న సమయంలో వరుసగా రెండు పాయింట్లు సాధించిన సింధు గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సింధు ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ గెలుచుకుంది. పురుషుల విభాగంలో భారత షట్లర్ లక్ష్యసేన్‌కు ప్రిక్వార్టర్స్‌లో చుక్కెదురైంది. అతడు 17–21, 18–21తో రెండో సీడ్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడాడు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో అశ్విని పొన్నప్ప–సిక్కిరెడ్డి (భారత్) ద్వయం 13–21, 14–21తో మిసాకి మత్సుటోమో–అయాక తకహాషి (జపాన్) చేతిలో ఓడింది. సైనా అవుట్ భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సైనా 11–21, 8–21తో మూడో సీడ్ అకానె యామగుచి (జపాన్) చేతిలో ఓడింది. యామగుచి దూకుడు ముందు నిలువలేకపోయిన సైనా... మ్యాచ్‌ను 23 నిమిషాల్లోనే ప్రత్యర్థికి అప్పగించేసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. పురుషుల విభాగంలో భారత షట్లర్లు భమిడిపాటి సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్‌లకు కూడా నిరాశే ఎదురైంది. సాయిప్రణీత్ 12–21, 13–21తో జావో జున్‌పెంగ్ (చైనా) చేతిలో ఓడగా... రుస్తావిటో (ఇండోనేసియా)తో జరిగిన మ్యాచ్‌లో కశ్యప్ గాయంతో ఆరంభంలోనే వెనుదిరిగాడు. కేవలం నిమిషం పాటు సాగిన ఈ మ్యాచ్‌లో కశ్యప్ 0–3తో వెనుకబడిన సమయంలో మ్యాచ్ నుంచి వైదొలిగాడు. -
సింధు శుభారంభం
ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రణయ్ ముందంజ, జయరామ్ ఓటమి బర్మింగ్‌హామ్: ఆద్యంతం ఆధిపత్యం కనబరిచిన భారత స్టార్ పీవీ సింధు ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఆరో సీడ్ సింధు 21–10, 21–11తో ప్రపంచ 33వ ర్యాంకర్ మెట్టీ పుల్సెన్ (డెన్మార్క్)పై విజయం సాధించింది. కేవలం 29 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధుకు ఏ దశలోనూ ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురుకాలేదు. తొలి గేమ్‌లో స్కోరు 7–6 వద్ద ఈ హైదరాబాద్ అమ్మాయి వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 11–7తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఒకసారి వరుసగా మూడు, అనంతరం వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి తొలి గేమ్‌ను అలవోకగా సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ ఆరంభం నుంచి సింధు ఆధిపత్యం చలాయించింది. స్కోరు 7–4 వద్ద సింధు వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 13–4తో ముందంజ వేసి ఇక వెనుదిరిగి చూడలేదు. గురు వారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో దినార్ దియా అయుస్తిన్ (ఇండోనేసియా)తో సింధు తలపడుతుంది. ఐదోసారి ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో ఆడుతోన్న సింధు గతంలో ఏనాడూ ప్రిక్వార్టర్ ఫైనల్ దశను దాటి ముందుకెళ్లలేకపోయింది. మిశ్రమ ఫలితాలు మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తొలి రౌండ్లో ప్రపంచ 21వ ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ 17–21, 22–20, 21–19తో కియో బిన్ (చైనా)పై కష్టపడి గెలుపొందగా... భారత నంబర్‌వన్, ప్రపంచ 19వ ర్యాంకర్ అజయ్ జయరామ్ 19–21, 13–21తో ప్రపంచ 27వ ర్యాంకర్ హువాంగ్ జియాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. గతంలో హువాంగ్‌పై మూడుసార్లు నెగ్గిన జయరామ్ ఈసారి మాత్రం చేతులెత్తేయడం గమనార్హం. పురుషుల డబుల్స్ తొలిరౌండ్లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి (భారత్) ద్వయం 19–21, 21–10, 18–21తో పీటర్ బ్రిగ్స్–టామ్ ఉల్ఫెండ్సన్ (ఇంగ్లండ్) జంట చేతిలో... మహిళల డబుల్స్ తొలి రౌండ్లో మేఘన–పూర్వీషా రామ్ (భారత్) జోడీ 19–21, 12–21తో సు యా చింగ్–వు తి జంగ్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓడిపోయాయి. ఇండియా ఓపెన్‌లో సింధు , సైనా మరోవైపు ఈ నెలాఖర్లో న్యూఢిల్లీలో జరిగే ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ ముఖాముఖిగా తలపడే అవకాశం ఉంది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగే ఈ టోర్నీకి సంబంధించిన ‘డ్రా’ వివరాలను బుధవారం విడుదల చేశారు. మహిళల సింగిల్స్‌లో సింధు తొలి రౌండ్లో జియావో లియాంగ్ (సింగపూర్)తో... చియా సిన్ లీ (చైనీస్ తైపీ)తో సైనా తలపడతారు. తొలి రౌండ్‌ను దాటితే ప్రిక్వార్టర్ ఫైనల్లో సెనా కవాకామి (జపాన్)తో సింధు... పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)తో సైనా ఆడే అవకాశముంది. ఈ అడ్డంకిని అధిగమిస్తే క్వార్టర్ ఫైనల్లో సైనా, సింధు ఆడతారు. ఇప్పటివరకు అంతర్జాతీయ వేదికపై సైనా, సింధు ఏకైకసారి 2014 సయ్యద్ మోది గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో పోటీపడగా... సైనా పైచేయి సాధించింది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్, భమిడిపాటి సాయిప్రణీత్ తొలి రౌండ్లో క్వాలిఫయర్స్‌తో ఆడతారు. -
టాప్ సీడ్‌గా సైనా
న్యూఢిల్లీ: విదేశాల్లో పలు సూపర్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు స్వదేశంలో జరిగే ఏకైక సూపర్ సిరీస్ టోర్నీ ‘ఇండియా ఓపెన్’ మాత్రం కలిసిరాలేదు. గత నాలుగేళ్లలో ఒక్కసారి మాత్రమే క్వార్టర్ ఫైనల్ చేరుకున్న ఈ హైదరాబాద్ అమ్మాయి ఈసారి మంచి ఫలితాలను సాధించాలనే పట్టుదలతో ఉంది. ఈనెల 24 నుంచి న్యూఢిల్లీలో జరిగే ఈ మెగా టోర్నీలో సైనాకు మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడింగ్ లభించింది. ప్రస్తుత ప్రపంచ చాంపియన్... ‘ఆల్ ఇంగ్లండ్’ తాజా చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)కు రెండో సీడింగ్‌ను కేటాయించారు. మరోవైపు ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో... ఐదుసార్లు ప్రపంచ చాంపియన్, రెండుసార్లు ఒలింపిక్ చాంపియన్ లిన్ డాన్ (చైనా) తొలిసారి బరిలోకి దిగుతున్నాడు. నిలకడగా ఫలితాలు: సైనా ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ద్వారా ఎన్నో సానుకూలాంశాలు లభించాయని సైనా నెహ్వాల్ వ్యాఖ్యానించింది. ‘కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాను. ఓవరాల్‌గా నా ఆటతీరులో ఎంతో పురోగతి కనిపిస్తోంది. సీజన్‌లోని ఇతర టోర్నీల్లోనూ మంచి ఫలితాలు సాధిస్తాననే నమ్మకం ఉంది’ అని సోమవారం హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన సందర్భంగా సైనా వ్యాఖ్యానించింది. ‘ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్నాను. ఈ వారం తాజా ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి వచ్చే అవకాశముంది’ అని ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన సైనా తెలిపింది. -
ఆల్ ఇంగ్లండ్ ఓపెన్.. సైనా రికార్డు
బర్మింగ్‌హామ్: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ రికార్డు నెలకొల్పింది. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో సైనా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళగా హైదరాబాదీ చరిత్ర సృష్టించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో సైనా 21-13, 21-13 స్కోరుతో చైనా షట్లర్ సన్ యూపై అలవోక విజయం సాధించింది. సైనా వరుస గేమ్‌ల్లో మ్యాచ్‌ను వశం చేసుకుంది. -
స్విస్ ఓపెన్‌పై సైనా గురి
బాసెల్ (స్విట్జర్లాండ్): ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో నిరాశపరిచిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తనకు కలిసొచ్చిన స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 2011, 2012లలో ఈ టోర్నీ టైటిల్ నెగ్గిన సైనా గతేడాది సెమీఫైనల్లో నిష్ర్కమించింది. మంగళవారం మొదలయ్యే ఈ టోర్నీలో తొలి రోజు పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్‌లతోపాటు మిక్స్డ్ డబుల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్, పురుషుల డబుల్స్ విభాగాలలో క్వాలిఫయింగ్ పోటీలు నిర్వహిస్తారు. పురుషుల సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్... మహారాష్ట్ర ప్లేయర్ ఆనంద్ పవార్ బరిలో ఉన్నారు. తొలి రౌండ్లో హుర్స్‌కెనైన్ (స్వీడన్)తో శ్రీకాంత్; కాక్ పోంగ్ లోక్ (మలేసియా)తో ఆనంద్ పవార్; మిజెస్ (నెదర్లాండ్స్)తో కశ్యప్ ఆడతారు. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో క్వాలిఫయర్‌తో సైనా... షిజియాన్ వాంగ్ (చైనా)తో సైలి రాణే తలపడతారు. పి.వి.సింధుతో ఆడాల్సిన బీట్రిజ్ (స్పెయిన్) వైదొలగడంతో ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మాయికి ‘వాకోవర్’ లభించే అవకాశముంది. అంతా అనుకున్నట్లు జరిగితే క్వార్టర్స్‌లో టాప్ సీడ్ యిహాన్ వాంగ్ (చైనా)తో సైనా; షిజియాన్ వాంగ్‌తో సింధు తలపడే అవకాశముంది. డబుల్స్ తొలి రౌండ్లోహెరిచ్-కార్లా నెల్టి (జర్మనీ) జోడితో జ్వాల-అశ్విని పొనప్ప జంట తలపడుతుంది.