టాప్ సీడ్‌గా సైనా
న్యూఢిల్లీ: విదేశాల్లో పలు సూపర్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు స్వదేశంలో జరిగే ఏకైక సూపర్ సిరీస్ టోర్నీ ‘ఇండియా ఓపెన్’ మాత్రం కలిసిరాలేదు. గత నాలుగేళ్లలో ఒక్కసారి మాత్రమే క్వార్టర్ ఫైనల్ చేరుకున్న ఈ హైదరాబాద్ అమ్మాయి ఈసారి మంచి ఫలితాలను సాధించాలనే పట్టుదలతో ఉంది. ఈనెల 24 నుంచి న్యూఢిల్లీలో జరిగే ఈ మెగా టోర్నీలో సైనాకు మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడింగ్ లభించింది. ప్రస్తుత ప్రపంచ చాంపియన్... ‘ఆల్ ఇంగ్లండ్’ తాజా చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)కు రెండో సీడింగ్‌ను కేటాయించారు. మరోవైపు ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో... ఐదుసార్లు ప్రపంచ చాంపియన్, రెండుసార్లు ఒలింపిక్ చాంపియన్ లిన్ డాన్ (చైనా) తొలిసారి బరిలోకి దిగుతున్నాడు.
నిలకడగా ఫలితాలు: సైనా
ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ద్వారా ఎన్నో సానుకూలాంశాలు లభించాయని సైనా నెహ్వాల్ వ్యాఖ్యానించింది. ‘కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాను. ఓవరాల్‌గా నా ఆటతీరులో ఎంతో పురోగతి కనిపిస్తోంది. సీజన్‌లోని ఇతర టోర్నీల్లోనూ మంచి ఫలితాలు సాధిస్తాననే నమ్మకం ఉంది’ అని సోమవారం హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన సందర్భంగా సైనా వ్యాఖ్యానించింది. ‘ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్నాను. ఈ వారం తాజా ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి వచ్చే అవకాశముంది’ అని ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన సైనా తెలిపింది.