బర్మింగ్‌హామ్: 20 ఏళ్లుగా భారత షట్లర్లను అందని ద్రాక్షలా ఊరిస్తోన్న ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్న పీవీ సింధు ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. ఈ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన మహిళల ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 21–8, 21–8తో క్రిస్టోఫర్సెన్ (డెన్మార్క్)పై సునాయస విజయాన్ని నమోదు చేసి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. కేవలం 25 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో పూర్తి ఆధిపత్యం కనబర్చిన సింధు... ప్రత్యర్థిని ఏ దశలోనూ పుంజుకోనివ్వకుండా వరుస గేముల్లో మ్యాచ్‌ను ముగించేసింది. అయితే మరో టాప్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు తొలిరౌండ్‌లోనే చుక్కెదురైంది.
భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మ్యాచ్‌లో సైనా గాయంతో మధ్యలోనే వైదొలిగింది. మియా బ్లిచ్‌ఫెల్డ్ (డెన్మార్క్)తో జరిగిన ఈ పోరులో సైనా 8–21, 4–10తో వెనుకబడి ఉన్న తరుణంలో తప్పుకుంది. పురుషుల ప్రిక్వార్టర్స్‌లో లక్ష్యసేన్ 21–18, 21–17తో థామస్ రౌక్సెల్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. అయితే ఇతర భారత షట్లర్లు భమిడిపాటి సాయిప్రణీత్, హెచ్‌ఎస్ ప్రణయ్‌లకు మాత్రం ప్రిక్వార్టర్స్‌లో నిరాశే ఎదురైంది. సాయిప్రణీత్ 21–15, 12–21, 12–21తో విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్) చేతిలో... ప్రణయ్ 15–21, 14–21తో కెంటో మొమోటా (జపాన్) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు.
మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో అశ్విని పొన్నప్ప– సిక్కి రెడ్డి (భారత్) ద్వయం 21–17, 21–10తో గాబ్రియెల్ స్టోయేవా– స్టెఫాని స్టోయేవా (బల్గేరియా) జంటపై గెలిచింది. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్ పోరుల్లో సాత్విక్ సాయిరాజ్– అశ్విని పొన్నప్ప (భారత్) జోడీ 19–21, 9–21తో యుకీ కనెకొ– మిసాకి మత్సుటోటోమో (జపాన్) ద్వయం చేతిలో, ప్రణవ్ చోప్రా–సిక్కి రెడ్డి (భారత్) ద్వయం 15–21, 17–21తో రాస్మస్ స్పెర్సెన్–క్రిస్టిన్ బుష్ (డెన్మార్క్) జంట చేతిలో ఓడి ఇంటిదారి పట్టాయి. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 16–21, 21–11, 17–21తో కిమ్ అస్త్రుప్–ఆండ్రెస్ స్కరుప్ రస్ముస్సెన్ (డెన్మార్క్) జంట చేతిలో ఓడింది. మరో వైపు టోర్నీ నుంచి ఇండోనేసియా జట్టు తప్పుకుంది. ఆ జట్టు ప్రయాణించిన విమానంలోనే ఉన్న ఒకరు కరోనా పాజిటివ్‌గా తేలడంతో... టీమ్‌ను 10 రోజుల పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలంటూ టోర్నీ నిర్వాహకులు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment