సానియా... మళ్లీ సాధించెన్ | Hingis captured the US Open doubles title | Sakshi
Sakshi News home page

సానియా... మళ్లీ సాధించెన్

Published Mon, Sep 14 2015 1:40 AM | Last Updated on Sun, Sep 3 2017 9:20 AM

సానియా... మళ్లీ సాధించెన్

సానియా... మళ్లీ సాధించెన్

హింగిస్‌తో కలిసి యూఎస్ ఓపెన్ డబుల్స్ టైటిల్ వశం
ఈ ఏడాది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సొంతం

 
 న్యూయార్క్ : ఈ ఏడాది అద్వితీయ ఫామ్‌లో ఉన్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన కెరీర్‌లో మరో గొప్ప విజయం సాధించింది. స్విట్జర్లాండ్ దిగ్గజం మార్టినా హింగిస్‌తో కలిసి ఈ హైదరాబాద్ అమ్మాయి వరుసగా రెండో గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. గత జులైలో హింగిస్‌తోనే కలిసి సానియా వింబుల్డన్ టోర్నీలో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ ద్వయం 6-3, 6-3తో నాలుగో సీడ్ కేసీ డెలాక్వా (ఆస్ట్రేలియా)-యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్) జంటను ఓడించింది. ఈ టోర్నీలో ఈ ఇండో-స్విస్ జోడీ తమ ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. విజేతగా నిలిచిన సానియా-హింగిస్‌లకు 5 లక్షల 70 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 కోట్ల 77 లక్షలు) లభించింది. రన్నరప్ డెలాక్వా-ష్వెదోవా జోడీకి 2 లక్షల 75 వేల డాలర్లు (రూ. కోటీ 82 లక్షలు) దక్కాయి.

► 70 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సానియా జంట సమన్వయంతో ఆడింది. తొలి సెట్‌లో రెండుసార్లు ప్రత్యర్థి జంట సర్వీస్‌ను బ్రేక్ చేసి 5-3తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొమ్మిదో గేమ్‌లో సానియా తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో తొలి సెట్‌ను ఈ ద్వయం 31 నిమిషాల్లో సొంతం చేసుకుంది. రెండో సెట్‌లోనూ సానియా జోడీ తమ జోరు కొనసాగించింది. మూడుసార్లు తమ ప్రత్యర్థి సర్వీస్‌లను బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది.
► ఓవరాల్‌గా సానియా కెరీర్‌లో ఇది ఐదో డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్. మహిళల డబుల్స్‌లో మార్టి నా హింగిస్‌తో కలిసి ఈ ఏడాది ఆమె వింబుల్డన్ టైటిల్ నెగ్గగా... మిక్స్‌డ్ డబుల్స్‌లో మహేశ్ భూపతితో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ (2009, 2012)... బ్రూనో సోరెస్ (బ్రెజిల్) జతగా 2014 యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించింది.
► మరోవైపు మార్టినా హింగిస్ కెరీర్‌లో ఇది 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఇందులో సింగిల్స్‌లో ఐదు, మహిళల డబుల్స్‌లో 11, మిక్స్‌డ్ డబుల్స్‌లో నాలుగు ఉన్నాయి. గతేడాది యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్‌లో ఫ్లావియా పెనెట్టా (ఇటలీ)తో రన్నరప్‌గా నిలిచిన హింగిస్.. ఈ ఏడాది సానియాతో కలిసి ట్రోఫీని నెగ్గడం విశేషం. హింగిస్‌కు 2015లో భారత భాగస్వాములతో ఇది ఐదో గ్రాండ్‌స్లామ్ కావడం గమనార్హం.
► ఈ టోర్నీలో బరిలోకి దిగకముందే ష్వెదోవా సెప్టెంబరు 11ను తన వివాహ  తేదీగా ఖరారు చేసుకుంది. అయితే అనూహ్యంగా ఆమె ఫైనల్‌కు చేరుకోవడంతో వివాహాన్ని వాయిదా వేసుకోవడం గమనార్హం.
 
 ‘ఈ ఏడాది అన్నీ కలిసొచ్చాయి. ప్రపంచ నంబర్‌వన్ అయ్యాను. వింబుల్డన్ టైటిల్ కూడా గెలిచాం. ఇప్పుడు యూఎస్ ఓపెన్ సాధించాం. గతేడాది ఇదే వేదికపై మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను గెలిచా. ఫైనల్‌కు ముందు మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. సహజసిద్ధమైన ఆటను ఆడాం. హింగిస్ మంచి ప్రోత్సాహమిచ్చింది. ఆర్థర్ యాష్ స్టేడియంలో అభిమానుల మద్దతు బాగుంది. ఎక్కడికి వెళ్లినా భారతీయులు మంచి అభిమానాన్ని చూపుతారు. ఇక్కడ కూడా అలాంటి మద్దతే ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు.’    
-సానియా మీర్జా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement