చిన్నోడి టవల్‌ను పెద్దాయన ‘కొట్టేశాడు’
వింబుల్డన్‌లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. మ్యాచ్ ముగిసిన తర్వాత విజయానందంలో ఉన్న ఆటగాళ్లు తమకు సంబంధించిన ఒక వస్తువును సాధారణంగా ప్రేక్షకుల్లోకి విసరడం తరచుగా జరుగుతుంటుంది. అభిమానులు కూడా దానిని అంతే అపురూపంగా దాచుకోవడం సహజం. అమెరికాకు చెందిన జాక్ సాక్ తొలి రౌండ్‌లో క్రిస్టియన్ గారిన్‌ను ఓడించాడు. అనంతరం అతను తన చెయిర్ వద్దకు వస్తున్న సమయంలో ఒక చిన్నారి తన టవల్‌ను ఇవ్వాల్సిందిగా కోరాడు.
దాంతో సాక్ వెంటనే స్పందిస్తూ టవల్‌ను ఆ అబ్బాయి వైపు విసిరేశాడు. దానికి ఆ కుర్రాడికంటే ముందు వరుసలో కూర్చొన్న ఒక ‘పెద్దాయన’ అతనికి అందకుండా దానిని బలవంతంగా లాగేసుకున్నాడు. దీన్ని సాక్ కూడా ముందుగా గుర్తించలేదు. అయితే ఆ వీడియో వైరల్ కావడంతో అందరి దృష్టికి ఈ ఘటన వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులంతా ఆ ముసలాడిని పరుష పదజాలంతో తిట్టి పోశారు. ప్రపంచ నంబర్‌వన్ ఆండీ ముర్రే తల్లి జూడీ అయితే అతనికి సిగ్గు లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. అనంతరం జాక్ సాక్ ఆ అబ్బాయి ఎవరో గుర్తించి వివరాలు ఇవ్వండి, మరో టవల్ ఇస్తానంటూ ప్రకటించాడు. సోషల్ మీడియా ప్రచారంతో ఒకరోజు తర్వాత ఆ కుర్రాడిని గుర్తించారు. అయితే అతను స్వస్థలం ఐర్లాండ్‌కు వెళ్లిపోయాడని తెలిసింది.