హాకీ మ్యాచ్ ఇక 60 నిమిషాలే!
ది హేగ్: ‘మీ వద్ద కేవలం 70 నిమిషాలు ఉన్నాయి. మీ జీవితంలో ఇవి ఎంతో కీలక క్షణాలు. ఏం చేసినా ఈ 70 నిమిషాల్లోనే’...అంటూ చక్‌దే ఇండియా సినిమాలో షారుఖ్ ఖాన్ చెప్పిన పాపులర్ డైలాగ్ గుర్తుందా! ఇకపై హాకీలో ఆ 70 నిమిషాలు అనేది చరిత్రగా మారనుంది. ఎందుకంటే హాకీ మ్యాచ్‌ను 60 నిమిషాలకు కుదించాలని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) నిర్ణయించింది. ప్రతీ 15 నిమిషాలకు విరామం చొప్పున నాలుగు భాగాలుగా ఈ 60 నిమిషాల మ్యాచ్ సాగుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇంచియాన్‌లో జరిగే ఆసియా క్రీడల నుంచి ఈ టైమింగ్‌ను అమలు చేయనున్నట్లు ఎఫ్‌ఐహెచ్ అధ్యక్షుడు లియాండ్రో నెగ్రె వెల్లడించారు. కొత్త నిబంధనలు ఆటను మరింత ఆసక్తికరంగా మారుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఈ విధానాన్ని హాకీ ఇండియా లీగ్‌లో, యూరోపియన్ లీగ్‌లో ప్రయోగాత్మకంగా ఉపయోగించాం. వాటికి మంచి స్పందన వచ్చింది. అందుకే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని దీనిని అంతర్జాతీయ స్థాయిలో అమలు చేయనున్నాం. 2016 రియో ఒలింపిక్స్‌లో ఇదే టైమింగ్ ఉంటుంది’ అని నెగ్రె స్పష్టం చేశారు.
ఆస్ట్రేలియాకే టైటిల్
ఆదివారం ముగిసిన ప్రపంచ కప్ పురుషుల హాకీ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా జట్టు టైటిల్ నిలబెట్టుకుంది. ఫైనల్‌లో ఆస్ట్రేలియా 6-1, గోల్స్ తేడాతో నెదర్లాండ్స్‌పై విజయం సాధిం చింది. కాంస్య పతక పోరులో అర్జెంటీనా 2-0తో ఇంగ్లండ్‌ను ఓడించింది.