
క్వార్టర్స్ లో చిత్తు చిత్తు
న్యూఢిల్లీ: పునర్‌వైభవం కోసం పాకులాడుతున్న భారత హాకీ జట్టు సొంతగడ్డపై జరుగుతున్న వరల్డ్ లీగ్ ఫైనల్స్‌లో నిరాశపర్చింది. తొలి 15 నిమిషాల్లో రెండు గోల్స్ కొట్టి ఆధిక్యం సంపాదించినా... తర్వాత ఆసీస్ ఎదురుదాడికి నిలువలేకపోయింది.
దీంతో మేజర్ ధ్యాన్‌చంద్ జాతీయ స్టేడియంలో బుధవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో ఆస్ట్రేలియా 7-2తో భారత్‌ను చిత్తుగా ఓడించి సెమీస్‌కు అర్హత సాధించింది. భారత్ తరఫున బీరేంద్ర లక్రా (6వ ని.), యువరాజ్ వాల్మీకి (11వ ని.) గోల్స్ చేయగా... నికోలస్ బడ్జెన్ (24వ ని.), జాసన్ విల్సన్ (29వ ని.), గ్లెన్ టర్నర్ (35వ ని.), రస్సెల్ ఫోర్డ్ (41, 47వ ని.), సిమన్ ఆర్కార్డ్ (45వ ని.), జాకబ్ వాటెన్ (65వ ని.) ఆసీస్‌కు గోల్స్ అందించారు. ఆట ఆరంభంలో పదునైన అటాక్‌తో ఆడిన భారత్ 20 నిమిషాల పాటు ఆధిపత్యం కొనసాగించింది.
మిడ్‌ఫీల్డ్, ఫార్వర్డ్‌లైన్ సమన్వయంతో ముందుకు కదిలింది. మ్యాచ్ సాగేకొద్దీ ఆసీస్ దాడుల్లో వేగం పెంచి ఫలితాన్ని రాబట్టింది. భారత్ సర్కిల్‌లోకి సమర్థంగా దూసుకెళ్లడంతో పాటు పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలిచింది. దీంతో తొలి అర్ధభాగానికి 3-2 ఆధిక్యంలో నిలిచింది. ఎండ్‌లు మారిన తర్వాత కూడా భారత్ ఆటతీరులో మార్పు రాలేదు. ఐదు, ఎనిమిది స్థానాల కోసం శుక్రవారం జరిగే వర్గీకరణ మ్యాచ్‌లో భారత్... జర్మనీతో తలపడుతుంది.
మరో క్వార్టర్ ఫైనల్లో... ఒలింపిక్ చాంపియన్ జర్మనీపై నెదర్లాండ్స్ 2-1తో గెలిచి సెమీస్‌కు చేరింది. మ్యాచ్ తొలి నిమిషంలోనే వాన్‌డెర్ వీర్డెన్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి నెదర్లాండ్స్‌కు 1-0 ఆధిక్యాన్ని ఇచ్చాడు. ఆరో నిమిషంలో సీవ్ వాన్ యాస్ రెండో గోల్ చేశాడు. జర్మనీ తరఫున ఒలీవర్ కాన్ (38వ ని.) ఏకైక గోల్ చేశాడు. మరో క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ 1-0తో బెల్జియంను ఓడించి సెమీస్‌కు చేరింది. ఇంగ్లండ్ తరఫున టామ్ కార్సన్ (47వ ని.) గోల్ చేశాడు.
గట్టెక్కిన న్యూజిలాండ్
హోరాహోరీగా జరిగిన మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు సడెన్‌డెత్ పద్ధతి ద్వారా అర్జెంటీనాపై గెలిచి సెమీర్‌కు చేరింది. నిర్ణీత సమయం ముగిసే సమయానికి ఇరు జట్లు 1-1తో సమానంగా నిలిచాయి. మ్యాచ్ ఎనిమిదో నిమిషంలో కేన్ రసెల్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి కివీస్‌కు ఆధిక్యాన్ని అందించాడు. అయితే 59వ నిమిషంలో మాటియాస్ పారెడెస్ గోల్ ద్వారా అర్జెంటీనా స్కోరు సమం చేసింది. దీంతో షూటౌట్ అనివార్యమైంది. ఇందులో ఐదేసి అవకాశాలకు గాను రెండు జట్లు రెండేసి గోల్స్ చేశాయి. దీంతో ఫలితం కోసం సడెన్ డెత్‌ను ఆశ్రయించారు. ఇందులో తొలి అవకాశంలో రెండు జట్లూ గోల్స్ చేశాయి. ఆ తర్వాతి అవకాశంలో అర్జెంటీనా ఆటగాడు విఫలం కాగా... న్యూజిలాండ్ ఆటగాడు హిల్టన్ గోల్ చేసి కివీస్‌ను సెమీస్‌కు చేర్చాడు. సెమీస్‌లో ఇంగ్లండ్‌తో న్యూజిలాండ్; ఆస్ట్రేలియాతో నెదర్లాండ్స్ తలపడతాయి.