
'ధోనీలా ఫినిషింగ్ టచ్ ఇవ్వాలని ఉంది'
కోల్‌కతా: 'ధోనీని నేను బాగా ఫాలో అవుతాను. వికెట్ కీపింగ్, బ్యాటింగ్‌తో ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన నుంచి ఎన్నో నేర్చుకునేందుకు నేను ప్రయత్నిస్తుంటా. భారత్‌కు ఆయన ఎంతోమంచి క్రికెటర్. నాకు మార్గదర్శకుడు లాంటివారు. ఆయనలా నేను మ్యాచులను ఫినిష్ చేయాలనుకుంటున్నాను' ఇవి పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ సర్ఫాజ్ అహ్మద్ మీడియాతో అన్న మాటలు.
తన ఆటతీరుతో, ఒత్తిడిలోనూ మైదానంలో నింపాదిగా ఉండే వ్యవహార సరళితో ఇటీవలికాలంలో సర్ఫాజ్ పెద్ద ఎత్తున ప్రశంసలందుకున్నాడు. ఇప్పటికీ తన ఆటతీరును మెరుగుపరుచుకోవాలని భావిస్తున్నట్టు చెప్తున్న ఈ కుడిచేతివాటం బ్యాట్స్‌మన్ తాజాగా తన ఐడల్ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోనీని ప్రశంసల్లో ముంచెత్తాడు. ధోనీ అడుగుజాడల్లో నడుస్తూ తాను మరింతగా రాణించాలనుకుంటున్నట్టు ఆదివారం కోల్‌కతా మీడియాతో చెప్పాడు.
పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్‌లో తన స్థానం గురించి మాట్లాడుతూ జట్టు అవసరాల మేరకు ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధమని, లోయర్ ఆర్డరైనా టాప్ ఆర్డరైనా ఎక్కడైనా తాను ఆడగలనని చెప్పాడు. బంగ్లాదేశ్‌లో జరిగిన ఆసియా కప్‌లో పాక్ జట్టు అనుకున్న స్థాయిలో రాణించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.