
న్యూఢిల్లీ: డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్‌లో అన్ సీడెడ్ గా బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ సంచలన విజయం నమోదు చేశాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ పోరులో వరల్డ్ మాజీ నంబర్ వన్, ఏడో సీడ్ లీ చాంగ్ వుయ్ పై విజయం సాధించి క్వార్టర్స్ లోకి ప్రవేశించాడు. ప్రణయ్ 21-17,11-21, 21-19 తేడాతో మలేషియా ఆటగాడు లీ చాంగ్ ను మట్టికరిపించాడు. తొలి గేమ్ ను పోరాడి గెలిచిన ప్రణయ్, రెండో గేమ్ ను కోల్పోయాడు. ఆపై నిర్ణయాత్మక మూడో గేమ్ లో ఇరువురి మధ్య హోరాహోరీ పోరు జరిగింది. చివరవరకూ ఉత్కంఠభరితంగా సాగిన మూడో గేమ్ లో ప్రణయ్ 21-19 తో గెలిచి లీ చాంగ్ కు షాకిచ్చాడు.
ఇక మరో పురుషుల సింగిల్స్ ప్రి క్వార్టర్స్ లో కిడాంబి శ్రీకాంత్ విజయం సాధించాడు. శ్రీకాంత్ 21-13, 8-21, 21-18 తేడాతో కొరియా ఆటగాడు జియన్ హైయిక్ జిన్ పై గెలిచి క్వార్టర్స్ కు చేరాడు. ఇక మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ ఫైనల్లో సైనా నెహ్వాల్ 22-20, 21-13 తేడాతో నిచాన్ జింద్ పాల్ పై గెలిచి క్వార్టర్స్ లోకి ప్రవేశించింది. తొలి గేమ్ ను కష్టపడి గెలిచిన సైనా.. రెండో గేమ్ ను సునాయాసంగా చేజిక్కించుకుని క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment