ఆంధ్ర ఆశలు సజీవం | Huge success on Hyderabad | Sakshi
Sakshi News home page

ఆంధ్ర ఆశలు సజీవం

Published Sat, Jan 13 2018 1:07 AM | Last Updated on Sat, Jun 2 2018 5:38 PM

Huge success on Hyderabad - Sakshi

సాక్షి, విశాఖపట్నం: కీలకమైన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆంధ్ర జట్టు సయ్యద్‌ ముస్తాక్‌ అలీ సౌత్‌జోన్‌ టి20 టోర్నమెంట్‌లో మూడో విజయం నమోదు చేసింది. సూపర్‌ లీగ్‌ దశకు అర్హత సాధించే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. హైదరాబాద్‌ జట్టుతో స్థానిక వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్ర ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 129 పరుగులు చేసింది. సందీప్‌ (35 బంతుల్లో 39; 3 ఫోర్లు), కెప్టెన్‌ అంబటి రాయుడు (25 బంతుల్లో 24; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఆంధ్ర బౌలర్లలో హరిశంకర్‌ రెడ్డి మూడు వికెట్లు, బండారు అయ్యప్ప రెండు వికెట్లు తీశారు. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర జట్టు 18.2 ఓవర్లలో నాలుగు వికెట్లకు 133 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆంధ్ర జట్టును రికీ భుయ్‌ (58 బంతుల్లో 73 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), డీబీ రవితేజ (43 బంతుల్లో 46; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆదుకున్నారు. వీరిద్దరూ హైదరాబాద్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. అలవోకగా ఆడుతూ మూడో వికెట్‌కు 114 పరుగులు జోడించారు. ఆంధ్ర విజయాన్ని ఖాయం చేశారు. హైదరాబాద్‌ బౌలర్లలో సిరాజ్‌ మూడు వికెట్లు తీయగా, ఆశిష్‌ రెడ్డికి ఒక వికెట్‌ దక్కింది.  

ఎవరికి అవకాశం? 
ప్రస్తుతం ఆంధ్ర (రన్‌రేట్‌ –0.109), కర్ణాటక (+1.445), తమిళనాడు (+0.314) తలా 12 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే రన్‌రేట్‌లో ఆంధ్ర ఈ రెండు జట్లకంటే వెనుకబడి ఉంది. హైదరాబాద్‌ ఎనిమిది పాయింట్లతో నాలుగో స్థానంలో, కేరళ నాలుగు పాయింట్లతో ఐదో స్థానంలో, గోవా పాయింట్లేమీ లేకుండా ఆరో స్థానంలో ఉన్నాయి. ఆదివారం జరిగే చివరి రౌండ్‌ లీగ్‌ మ్యాచ్‌ల్లో గోవాతో ఆంధ్ర; తమిళనాడుతో హైదరాబాద్‌; కర్ణాటకతో కేరళ తలపడతాయి. ఒకవేళ ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు జట్లు తమ ప్రత్యర్థి జట్లపై విజయం సాధిస్తే మూడు జట్లూ 16 పాయింట్లతో సమమవుతాయి. ఒకవేళ ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు జట్లు చివరి లీగ్‌ మ్యాచ్‌ల్లో ఓడిపోతే మాత్రం హైదరాబాద్‌తో కలిపి నాలుగు జట్లు 12 పాయింట్లతో సమఉజ్జీగా నిలుస్తాయి. ఈ పరిస్థితిలో మెరుగైన రన్‌రేట్‌తో ఉన్న రెండు జట్లు ముందంజ వేస్తాయి. లీగ్‌ మ్యాచ్‌లు ముగిశాక తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లే సూపర్‌ లీగ్‌ దశకు అర్హత సాధిస్తాయి. ఓవరాల్‌గా ఐదు (నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, సెంట్రల్‌) జోన్‌ల నుంచి రెండేసి జట్ల చొప్పున మొత్తం 10 జట్లు సూపర్‌ లీగ్‌ దశకు అర్హత పొందుతాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement