South jone cricket
-
ఆంధ్ర ఆశలు సజీవం
సాక్షి, విశాఖపట్నం: కీలకమైన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆంధ్ర జట్టు సయ్యద్ ముస్తాక్ అలీ సౌత్‌జోన్ టి20 టోర్నమెంట్లో మూడో విజయం నమోదు చేసింది. సూపర్ లీగ్ దశకు అర్హత సాధించే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. హైదరాబాద్ జట్టుతో స్థానిక వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 129 పరుగులు చేసింది. సందీప్ (35 బంతుల్లో 39; 3 ఫోర్లు), కెప్టెన్ అంబటి రాయుడు (25 బంతుల్లో 24; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఆంధ్ర బౌలర్లలో హరిశంకర్ రెడ్డి మూడు వికెట్లు, బండారు అయ్యప్ప రెండు వికెట్లు తీశారు. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర జట్టు 18.2 ఓవర్లలో నాలుగు వికెట్లకు 133 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆంధ్ర జట్టును రికీ భుయ్ (58 బంతుల్లో 73 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), డీబీ రవితేజ (43 బంతుల్లో 46; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆదుకున్నారు. వీరిద్దరూ హైదరాబాద్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. అలవోకగా ఆడుతూ మూడో వికెట్‌కు 114 పరుగులు జోడించారు. ఆంధ్ర విజయాన్ని ఖాయం చేశారు. హైదరాబాద్ బౌలర్లలో సిరాజ్ మూడు వికెట్లు తీయగా, ఆశిష్ రెడ్డికి ఒక వికెట్ దక్కింది. ఎవరికి అవకాశం? ప్రస్తుతం ఆంధ్ర (రన్‌రేట్ –0.109), కర్ణాటక (+1.445), తమిళనాడు (+0.314) తలా 12 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే రన్‌రేట్‌లో ఆంధ్ర ఈ రెండు జట్లకంటే వెనుకబడి ఉంది. హైదరాబాద్ ఎనిమిది పాయింట్లతో నాలుగో స్థానంలో, కేరళ నాలుగు పాయింట్లతో ఐదో స్థానంలో, గోవా పాయింట్లేమీ లేకుండా ఆరో స్థానంలో ఉన్నాయి. ఆదివారం జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో గోవాతో ఆంధ్ర; తమిళనాడుతో హైదరాబాద్; కర్ణాటకతో కేరళ తలపడతాయి. ఒకవేళ ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు జట్లు తమ ప్రత్యర్థి జట్లపై విజయం సాధిస్తే మూడు జట్లూ 16 పాయింట్లతో సమమవుతాయి. ఒకవేళ ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు జట్లు చివరి లీగ్ మ్యాచ్‌ల్లో ఓడిపోతే మాత్రం హైదరాబాద్‌తో కలిపి నాలుగు జట్లు 12 పాయింట్లతో సమఉజ్జీగా నిలుస్తాయి. ఈ పరిస్థితిలో మెరుగైన రన్‌రేట్‌తో ఉన్న రెండు జట్లు ముందంజ వేస్తాయి. లీగ్ మ్యాచ్‌లు ముగిశాక తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లే సూపర్ లీగ్ దశకు అర్హత సాధిస్తాయి. ఓవరాల్‌గా ఐదు (నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, సెంట్రల్) జోన్ల నుంచి రెండేసి జట్ల చొప్పున మొత్తం 10 జట్లు సూపర్ లీగ్ దశకు అర్హత పొందుతాయి. -
సౌత్‌జోన్ క్రికెట్ విజేతగా కడప జట్టు
కడప స్పోర్ట్స్ : కడప నగరం కేఎస్ఆర్ఎం క్రీడామైదానంలో గత మూడురోజులుగా నిర్వహిస్తున్న సౌత్‌జోన్ అంతర్ జిల్లాల దివ్యాంగుల క్రికెట్ విజేతగా కడప జట్టు నిలిచింది. శనివారం నిర్వహించిన ఫైనల్మ్యాచ్లో అనంత జట్టుపై విజయం సాధించి విజేతగా నిలిచింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎం. వెంకటశివారెడ్డి, కందుల విద్యాసంస్థల కరస్పాండెంట్ శివానందరెడ్డి, టీడీపీ నాయకుడు దుర్గాప్రసాద్‌లు విచ్చేసి విన్నర్స్‌కు, రన్నర్స్‌కు, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ట్రోఫీలు, జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికలాంగులు ఏ రంగంలోనూ ఎవరికీ తీసిపోరన్నారు. అన్ని రంగాలతో పాటు క్రీడారంగంలో కూడా రాణించడం అభినందనీయమన్నారు. అనంతరం విజేతగా నిలిచిన కడప జట్టుకు విన్నర్స్ ట్రోఫీ, రన్నరప్‌గా నిలిచిన అనంత జట్టుకు రన్నర్స్ ట్రోఫీ అందజేశారు. మ్యాన్ఆఫ్ ది మ్యాచ్‌గా సుబ్బరాయుడు (కడప), మ్యాన్ ఆఫ్ ది సిరీస్, బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా హుదా (అనంతపురం), బెస్ట్ బౌలర్‌గా అంజినాయుడు (చిత్తూరు)లకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో వికలాంగుల క్రికెట్ సంఘం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, కార్యదర్శి రామాంజుల నాయక్, వికలాంగుల సంక్షేమ సంఘం నాయకుడు వెంకట్రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అనంతపై కడప విజయభేరి.. శనివారం నిర్వహించిన ఫైనల్మ్యాచ్లో కడప, అనంత జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన అనంతపురం జట్టు బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. జట్టులోని రోశిరెడ్డి 60, హుదా 33 పరుగులు చేశారు. కడప బౌలర్లు క్రాంతి, సుబ్బరాయుడు, అశోక్, అంజి తలాఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కడప జట్టు 19 ఓవర్లలోనే 8 వికెట్ల నష్టానికి 133 పరుగుల విజయలక్ష్యం చేధించి విజేతగా నిలిచింది. జట్టులోని సుబ్బరాయుడు 45, వెంకటయ్య 24, అంజి 10 పరుగులు చేశారు. అనంత బౌలర్లు రామకృష్ణ 2, హుదా 2 వికెట్లు తీశారు. అనంతరం రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే సౌత్‌జోన్ జట్టును ప్రకటించారు. సౌత్‌జోన్ జట్టు: అంజినాయుడు (కెప్టెన్ చిత్తూరు), క్రాంతికుమార్, సుబ్బరాయుడు (కడప), నూరుల్లాహుదా, రోశిరెడ్డి (అనంతపురం), ఇ. అశోక్ (కడప), పురుషోత్తం (చిత్తూరు), లక్ష్మణ్ (కర్నూలు), రహీం (కర్నూలు), మనోహర్ (నెల్లూరు), భాస్కర్ (అనంతపురం), నాగరాజు (చిత్తూరు), రఫీక్ (కర్నూలు), వేదా (కడప), వెంకటేష్, రవి (అనంతపురం), జావిద్ (కడప).