గువాహటి: రంజీట్రోఫీ క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్టు నాకౌట్ ఆశలు ఆవిరయ్యాయి. ఇక్కడి బర్సాపురా స్టేడియంలో అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. అయినప్పటికీ నాకౌట్ దశకు అర్హత సాధించలేకపోయింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా కర్ణాటక 26 పాయింట్లతో, ఢిల్లీ 24 పాయింట్లతో తొలి రెండు స్థానాలను దక్కించుకొని ముందంజ వేశాయి. అస్సాంతో మ్యాచ్ గెలిచినప్పటికీ హైదరాబాద్ 15 పాయింట్లతో ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. ఈనెల 25న ఢిల్లీతో సొంతగడ్డపై జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో బోనస్ పాయింట్‌తో గెలిచినా కూడా హైదరాబాద్ రెండో స్థానాన్ని అందుకోవడం అసాధ్యం. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ జట్లతో హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కావడంతో జట్టుకు నిరాశ తప్పలేదు.
చివరిరోజు ఆటలో ఫాలోఆన్ ఆడుతూ ఓవర్‌నైట్ స్కోరు 300/7తో సోమవారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన అస్సాం 109 ఓవర్లలో 331 పరుగులకు ఆలౌటైంది. దీంతో హైదరాబాద్‌కు 142 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 96 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ అమిత్ సిన్హా (122; 14 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హైదరాబాద్ బౌలర్లలో రవికిరణ్, సుదీప్ త్యాగి చెరో 3 వికెట్లు పడగొట్టగా, ముదస్సర్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ అంబటి రాయుడు (73 బంతుల్లో 52 నాటౌట్; 7 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో చెలరేగడంతో హైదరాబాద్ లక్ష్యాన్ని ఛేదించింది. 39 ఓవర్లలో 6 వికెట్లకు 144 పరుగులు చేసి గెలుపొందింది. వికెట్ కీపర్ కొల్లా సుమంత్ (32; 1 ఫోర్, 1 సిక్స్), ఆకాశ్ భండారి (26) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో అరూప్ దాస్, రియాన్ పరాగ్ చెరో 2 వికెట్లు తీశారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 326 పరుగులు చేయగా, అస్సాం 136 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో గెలుపొందిన హైదరాబాద్ ఖాతాలో 6 పాయింట్లు చేరాయి.
స్కోరు వివరాలు
హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ ఎల్బీడబ్ల్యూ (బి) అరూప్ దాస్ 5; అక్షత్ రెడ్డి (బి) రజాకుద్దీన్ అహ్మద్ 2; సుమంత్ (సి) రహమాన్ (బి) రియాన్ పరాగ్ 32; టి.రవితేజ (సి) రహమాన్ (బి) అరూప్ దాస్ 4; సందీప్ (సి) పల్లవ్ కుమార్ (బి) రియాన్ పరాగ్ 16; అంబటి రాయుడు నాటౌట్ 52; ఆకాశ్ భండారి ఎల్బీడబ్ల్యూ (బి) రాహుల్ సింగ్ 26; మెహదీ హసన్ నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (39 ఓవర్లలో 6 వికెట్లకు) 144.
వికెట్ల పతనం: 1–6, 2–8, 3–18, 4–54, 5–69, 6–124.
బౌలింగ్: అరూప్ 7–0–21–2, రజాకుద్దీన్ 7–0–23–1, రాహుల్ 12–0–36–1, ప్రీతమ్ దాస్ 3–0–20–0, రియాన్ పరాగ్ 10–2–41–2.
Comments
Please login to add a commentAdd a comment