సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ తైక్వాండో పోటీలకు హైదరాబాద్ నగరం ఆతిథ్యమివ్వనుంది. గచ్చిబౌలి స్టేడియంలో ఈ నెల 11 నుంచి 16 వరకు ‘ఇండియా ఓపెన్ అంతర్జాతీయ తైక్వాండో చాంపియన్‌షిప్’ జరగనుంది. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర క్రీడల మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పోటీల లోగోను విడుదల చేశారు. సచివాలయంలో డి–బ్లాక్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన ఈ సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘తొలి అంతర్జాతీయ తైక్వాండో పోటీలు ఇంగ్లండ్‌లో జరిగాయి. తర్వాత రెండో విడత చాంపియన్‌షిప్‌కు ఆతిథ్యమిచ్చేందుకు పలు దేశాలు పోటీపడ్డాయి. అయితే చివరకు భారత్‌కు ఈ అవకాశం దక్కగా... తెలంగాణ రాష్ట్రంలో ఈ పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. అద్భుతమైనరీతిలో ఆతిథ్యమిచ్చేందుకు ప్రభుత్వపరంగా సహకారం అందజేస్తాం’ అని అన్నారు.
తెలంగాణలో క్రీడాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, క్రీడాకారులకు భారీ ప్రోత్సాహకాలు అందజేస్తున్న విషయాన్ని క్రీడల మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇటీవలే బ్యాడ్మింటన్ ఆటగాళ్లు గురుసాయిదత్, పారుపల్లి కశ్యప్‌లకు రూ. 55 లక్షల చొప్పున నజరానా అందజేశామని చెప్పారు. రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రశేఖర్ రావు, క్రీడల మంత్రి శ్రీనివాస్‌ల అండదండలతో ఈ టోర్నీని విజయవంతంగా నిర్వహిస్తామన్నారు. భవిష్య త్తులో తెలంగాణను క్రీడల్లోనే అగ్రగామి రాష్ట్రంగా నిలపాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో భారత తైక్వాండో సమాఖ్య ప్రధాన కార్యదర్శి ప్రభాత్ కుమార్ శర్మ, నంది టైర్స్ మేనేజింగ్ డైరెక్టర్ భరత్ రెడ్డి, రాష్ట్ర తైక్వాండో సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment