సాక్షి, హైదరాబాద్: కొరియన్ మార్షల్ ఆర్ట్స్ అయిన తైక్వాండోలో తెలంగాణ క్రీడాకారులు మెరిశారు. అద్భుత ప్రదర్శనతో ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డును సొంతం చేసుకున్నారు. అభ్యాస తైక్వాండో ఆధ్వర్యంలో జరిగిన ‘స్ట్రెయిట్ నీ చెస్ట్ లెవల్ కిక్స్’ పోటీల్లో రాష్ట్రానికి చెందిన 12 మంది తైక్వాండో క్రీడాకారులు రికార్డు ప్రదర్శనను నమోదు చేశారు. కేవలం ఒక గంట వ్యవధిలో 35,774 కిక్స్ నమోదు చేసి గిన్నిస్ రికార్డు అందుకున్నారు. వీరికి శనివారం తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి ఎల్బీ స్టేడియంలోని తన కార్యాలయంలో గిన్నిస్ రికార్డ్ ధ్రువపత్రాలను, పతకాలను అందజేశారు.
ఎ. మారుతి, ఎ. తన్మయ, సీహెచ్ సాకేత్, వి. హరికృష్ణ, వి. నితిన్, అద్విక, అనీశ్, రామ్‌చరణ్, అపర్ణ, ఆదిత్య, చైతన్య, హంసితారెడ్డి రికార్డు సాధించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా శాట్స్ చైర్మన్ గొప్ప రికార్డును అందుకున్న క్రీడాకారులను అభినందించారు. భవిష్యత్‌లో మరింత రాణించి రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారుల తల్లిదండ్రులతో పాటు గ్రాండ్ మాస్టర్ నాగుర్ బాబు, తెలంగాణ రాష్ట్ర తైక్వాండో సంఘం అధ్యక్షుడు సుభాశ్, కార్యదర్శి మల్లికార్జున్ మూర్తి, ఉపాధ్యక్షుడు వినోద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment