taekwondo championship
-
శభాష్.. సోహన్వికా
సాక్షి, అమరావతి: శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన బాలిక సోహన్వికారెడ్డి తైక్వాండో పోటీల్లో అదరగొట్టింది. ఆదివారం బెంగళూరులో నిర్వహించిన సౌత్ జోన్ సబ్ జూనియర్స్ తైక్వాండో విభాగంలో బంగారు పతకాన్ని సాధించింది. తలుపుల మండలం గంజివారిపల్లెకు చెందిన గుణరంజన్రెడ్డి కుమార్తె సోహని్వకా రెడ్డి చిన్నప్పటి నుంచి క్రీడలపై ఆసక్తిని కనబరుస్తోంది. -
తైక్వాండో విజేత తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ తైక్వాండో, క్వాన్ కి డో చాంపియన్‌షిప్‌లో తెలుగు రాష్ట్రాల జట్లు సత్తా చాటాయి. సౌత్‌జోన్‌లోని పలు రాష్ట్రాల జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో తొలి రెండు స్థానాలను దక్కించుకున్నాయి. టోర్నీలో అద్భుతంగా రాణించిన తెలంగాణ జట్టు చాంపియన్‌గా నిలవగా, ఆంధ్రప్రదేశ్ జట్టు రెండోస్థానాన్ని దక్కిం చుకుంది. కర్ణాటక, తమిళనాడు జట్లు వరుసగా మూడు, నాలుగు స్థానాలను సాధించాయి. ఈ సందర్భంగా ఆదివారం బహుమతుల ప్రదానోత్సవం సరూర్‌నగర్ స్టేడియంలో జరిగింది. శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో అంతర్జాతీయ ఆటగాడు జె. బాబులాల్ తదితరులు పాల్గొన్నారు. -
వేదాంత్, అబ్దుల్‌లకు రజతాలు
సాక్షి, హైదరాబాద్: సీకే క్లాసిక్ ఇంటర్నేషనల్ ఓపెన్ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ క్రీడాకారులు మెరుగైన ప్రదర్శన కనబరిచారు. మలేసియాలో మూడు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో రాష్ట్ర క్రీడాకారులు ఆరు పతకాలను సాధించారు. మొత్తం 22 దేశాలకు చెందిన క్రీడాకారులు ఈ టోర్నీలో తలపడగా... తెలంగాణ క్రీడాకారులు రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలను గెలుచుకున్నారు. ఇ. వేదాంత్ రెడ్డి, మొహమ్మద్ అబ్దుల్ సత్తార్ రన్నరప్‌గా నిలిచి రజత పతకాలు సాధించారు. పి. సాయి కిరణ్, పవన్ కుమార్, ఓంకార్, చంద్ర కుమార్ కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన క్రీడాకారులను శాట్స్ ఎండీ ఎ. దినకర్ బాబు అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించి దేశం గర్వించదగిన క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. -
తెలంగాణ క్రీడాకారుల ‘గిన్నిస్’ ప్రదర్శన
సాక్షి, హైదరాబాద్: కొరియన్ మార్షల్ ఆర్ట్స్ అయిన తైక్వాండోలో తెలంగాణ క్రీడాకారులు మెరిశారు. అద్భుత ప్రదర్శనతో ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డును సొంతం చేసుకున్నారు. అభ్యాస తైక్వాండో ఆధ్వర్యంలో జరిగిన ‘స్ట్రెయిట్ నీ చెస్ట్ లెవల్ కిక్స్’ పోటీల్లో రాష్ట్రానికి చెందిన 12 మంది తైక్వాండో క్రీడాకారులు రికార్డు ప్రదర్శనను నమోదు చేశారు. కేవలం ఒక గంట వ్యవధిలో 35,774 కిక్స్ నమోదు చేసి గిన్నిస్ రికార్డు అందుకున్నారు. వీరికి శనివారం తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి ఎల్బీ స్టేడియంలోని తన కార్యాలయంలో గిన్నిస్ రికార్డ్ ధ్రువపత్రాలను, పతకాలను అందజేశారు. ఎ. మారుతి, ఎ. తన్మయ, సీహెచ్ సాకేత్, వి. హరికృష్ణ, వి. నితిన్, అద్విక, అనీశ్, రామ్‌చరణ్, అపర్ణ, ఆదిత్య, చైతన్య, హంసితారెడ్డి రికార్డు సాధించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా శాట్స్ చైర్మన్ గొప్ప రికార్డును అందుకున్న క్రీడాకారులను అభినందించారు. భవిష్యత్‌లో మరింత రాణించి రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారుల తల్లిదండ్రులతో పాటు గ్రాండ్ మాస్టర్ నాగుర్ బాబు, తెలంగాణ రాష్ట్ర తైక్వాండో సంఘం అధ్యక్షుడు సుభాశ్, కార్యదర్శి మల్లికార్జున్ మూర్తి, ఉపాధ్యక్షుడు వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
క్రియేటర్స్ తైక్వాండో క్లబ్‌కు 5 పతకాలు
సాక్షి, హైదరాబాద్: ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో క్రియేటర్స్ తైక్వాండో క్లబ్ (సీటీసీ) క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఈ టోర్నమెంట్లో సీటీసీ ప్లేయర్లు ఐదు పతకాలను గెలుచుకున్నారు. ఇందులో మూడు స్వర్ణాలు, రెండు రజతాలు ఉన్నాయి. క్యాడెట్ బాలికల 55 కేజీల విభాగంలో గుల్జర్, జూనియర్ బాలికల 68 కేజీల కేటగిరీలో ఉదితి అగర్వాల్, బాలుర 78 కేజీల విభాగంలో అర్మాన్ గుల్జర్ పసిడి పతకాలతో మెరిశారు. ఆర్. శివ కిరణ్ (క్యాడెట్ బాలుర 33 కేజీలు), మక్తదీర్ అహ్మద్ (క్యాడెట్ బాలుర 41 కేజీలు) చెరో రజతాన్ని సాధించారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ టోర్నమెంట్లో పతకాలు సాధించిన తమ క్రీడాకారులను బుధవారం సీటీసీ సత్కరించింది. ఈ కార్యక్రమంలో సీటీసీ అధ్యక్షుడు విద్యాసాగర్, కోచ్ టి. సురేందర్ సింగ్ పాల్గొన్నారు. -
రాకేశ్‌కు రెండు పతకాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ ప్లేయర్ బొన్మన్ రాకేశ్ రెండు పతకాలు సాధించాడు. లక్నోలో ఇటీవల జరిగిన ఈ పోటీల్లో రాకేశ్ –74 కేజీల విభాగంలో కాంస్యం... పోమ్సె డెమో ఈవెంట్లో రజతం సాధించాడు. ఈ రెండు పతకాలతోపాటు రాకేశ్‌కు హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది. భారత తైక్వాండో సమాఖ్య సెక్రటరీ జనరల్ జిమ్మీ జగ్తియాని, కోశాధికారి సుధీర్, తెలంగాణ తైక్వాండో సంఘం అధ్యక్షుడు బాలరాజు చేతుల మీదుగా రాకేశ్ పతకాలను అందుకున్నాడు. -
లక్ష్మీ తులసికి రజతం
హైదరాబాద్: ఇంటర్నేషనల్ తైక్వాండో పోటీల్లో కుత్బుల్లాపూర్ బాలికలు శ్రీజరెడ్డి, లక్ష్మీ తులసి రాణించారు. భారత తైక్వాండో సమాఖ్య ఆధ్వర్యంలో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో లక్ష్మీ తులసి రజత పతకాన్ని గెలుచుకోగా... శ్రీజరెడ్డి కాంస్యాన్ని సాధించింది. కొంపల్లికి చెందిన శ్రీజరెడ్డి 47 కేజీల విభాగంలో మూడో స్థానంలో నిలిచింది. లక్ష్మీ తులసి 51 కేజీల విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. ఐదు రోజుల పాటు పోటీలు జరుగగా.. పదిహేను దేశాలకు చెందిన దాదాపు 2500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. -
11 నుంచి అంతర్జాతీయ తైక్వాండో చాంపియన్‌షిప్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ తైక్వాండో పోటీలకు హైదరాబాద్ నగరం ఆతిథ్యమివ్వనుంది. గచ్చిబౌలి స్టేడియంలో ఈ నెల 11 నుంచి 16 వరకు ‘ఇండియా ఓపెన్ అంతర్జాతీయ తైక్వాండో చాంపియన్‌షిప్’ జరగనుంది. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర క్రీడల మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పోటీల లోగోను విడుదల చేశారు. సచివాలయంలో డి–బ్లాక్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘తొలి అంతర్జాతీయ తైక్వాండో పోటీలు ఇంగ్లండ్‌లో జరిగాయి. తర్వాత రెండో విడత చాంపియన్‌షిప్‌కు ఆతిథ్యమిచ్చేందుకు పలు దేశాలు పోటీపడ్డాయి. అయితే చివరకు భారత్‌కు ఈ అవకాశం దక్కగా... తెలంగాణ రాష్ట్రంలో ఈ పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. అద్భుతమైనరీతిలో ఆతిథ్యమిచ్చేందుకు ప్రభుత్వపరంగా సహకారం అందజేస్తాం’ అని అన్నారు. తెలంగాణలో క్రీడాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, క్రీడాకారులకు భారీ ప్రోత్సాహకాలు అందజేస్తున్న విషయాన్ని క్రీడల మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇటీవలే బ్యాడ్మింటన్ ఆటగాళ్లు గురుసాయిదత్, పారుపల్లి కశ్యప్‌లకు రూ. 55 లక్షల చొప్పున నజరానా అందజేశామని చెప్పారు. రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రశేఖర్ రావు, క్రీడల మంత్రి శ్రీనివాస్‌ల అండదండలతో ఈ టోర్నీని విజయవంతంగా నిర్వహిస్తామన్నారు. భవిష్య త్తులో తెలంగాణను క్రీడల్లోనే అగ్రగామి రాష్ట్రంగా నిలపాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో భారత తైక్వాండో సమాఖ్య ప్రధాన కార్యదర్శి ప్రభాత్ కుమార్ శర్మ, నంది టైర్స్ మేనేజింగ్ డైరెక్టర్ భరత్ రెడ్డి, రాష్ట్ర తైక్వాండో సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. -
స్వర్ణంతో మెరిసిన కరణ్
సాక్షి, హైదరాబాద్: ఏయూ తైక్వాండో అంతర్జాతీయ చాంపియన్‌షిప్‌లో వైఎంసీఏ నారాయణగూడ యామగుచి తైక్వాండో అకాడమీ విద్యార్థులు సత్తా చాటారు. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో యామగుచి ప్లేయర్లు 3 పతకాలను సాధించారు. అకాడమీకి చెందిన కరణ్ స్వర్ణంతో మెరవగా... ఎస్.ఎన్. పూజ, మహాదేవ్ చెరో రజత పతకాన్ని గెలుచుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను యామగుచి తైక్వాండో అకాడమీ శుక్రవారం ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో అకాడమీ అధ్యక్షులు ఆర్కే కృష్ణ, ఉపాధ్యక్షులు స్వప్నారెడ్డి, కార్యదర్శులు పి. సంధ్య స్మిత, బీజే వినయ్ స్వరూప్, కోచ్ డి. విశ్వనాథ్ పాల్గొన్నారు. -
సంధ్య స్మిత పతకాల పంట
సాక్షి, హైదరాబాద్: యూఎస్ వరల్డ్ ఓపెన్ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారిణి సంధ్య స్మిత సత్తా చాటింది. అమెరికాలోని ఆరిజిన్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ టోర్నీలో ఆమె పాల్గొన్న ప్రతీ విభాగంలోనూ పతకాన్ని కైవసం చేసుకుంది. సంధ్య అద్భుత ప్రదర్శనకు 2 స్వర్ణాలు, 1 రజతం, 2 కాంస్యాలు ఆమె వశమయ్యాయి. కిరోగి కటా ఈవెంట్, వెపన్స్ విభాగాల్లో స్వర్ణాలు గెలుచుకున్న సంధ్య... వ్యక్తిగత కిరోగి (ఫైట్) విభాగంలో రజతాన్ని సాధించింది. వ్యక్తిగత పంచ్, బ్రేకింగ్ చాంపియన్‌షిప్ విభాగాల్లో రెండు కాంస్య పతకాలను కైవసం చేసుకుంది. -
శివ సాయికుమార్‌కు రజతం
సాక్షి, హైదరాబాద్: జాతీయ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో తెలంగాణ కుర్రాడు సీహెచ్ శివ సాయికుమార్ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. జమ్మూ కశ్మీర్‌లోని ఎంఏ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో రజతాన్ని గెలుచుకున్నాడు. ఈ టోర్నీలో రాష్ట్రం నుంచి నలుగురు క్రీడాకారుల బృందం పాల్గొనగా శివ సాయికుమార్ పతకాన్ని సాధించాడు. రాష్ట్ర జట్టుకు టి. బాలరాజు సారథ్యం వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర తైక్వాండో సంఘం కార్యదర్శి అబ్దుల్ సత్తార్ జాతీయ స్థాయిలో పతకాన్ని సాధించిన సాయికుమార్‌ను అభినందించారు. -
మహీన్కు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో మహీన్ నవాజ్ ఖాన్ సత్తా చాటింది. హైదరాబాద్ తైక్వాండో సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీ క్యాడెట్ బాలికల పూమ్సే వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఈ గెలుపుతో తెలంగాణ రాష్ట్ర తైక్వాండో క్యాడెట్ చాంపియన్‌షిప్‌కు నేరుగా అర్హత సాధించింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తైక్వాండో సంఘం అధ్యక్షుడు ఎం. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కె. సంపూర్ణం తదితరులు పాల్గొన్నారు. -
సోని, కృష్ణలకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తైక్వాండో చాంపియన్‌షిప్‌లో రింకూ సోని, కృష్ణ స్వర్ణాలను సాధించారు. వైఎంసీఏ నారాయణగూడలో జరిగిన ఈ టోర్నీలో సీనియర్ బాలికల విభాగంలో సోని విజేతగా నిలిచి పసిడిని గెలుచుకోగా... గౌతమి, పూజ వరుసగా రజత, కాంస్యాలను సాధించారు. సీనియర్ బాలుర పూల్ ‘ఎ’ కేటగిరీలో బి. కృష్ణ, శ్లోక్, కరీమ్... పూల్ ‘బి’ విభాగంలో కరన్, వాసు, అనిల్ వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. ఇందులో తొలి మూడు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులు జాతీయ టోర్నీలో తలపడే తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. మలేసియాలో ఆగస్టు 24 నుంచి 26 వరకు తైక్వాండో ఇంటర్నేషనల్ చాంపియన్‌షిప్ జరుగనుంది. ఇతర వమో విభాగాల విజేతల వివరాలు సబ్ జూనియర్ బాలురు: 1. ఆశ్రిత్, 2. ఆదిత్య, 3. అర్నవ్. క్యాడెట్ బాలురు: 1. వితేశ్, 2. అద్వైత్, 3. సలీమ్. జూనియర్ బాలురు: 1. అభిషేక్ లాల్, 2. విజేందర్ బాబు, 3. సాయి రిత్విక్. బాలికలు: 1. అహానా రాయ్, 2. అనన్య. -
హరినాథ్ దత్తాకు స్వర్ణం
హైదరాబాద్: రాష్ట్ర స్థాయి ఇంటర్ స్కూల్ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన ఎన్. హరినాథ్ దత్తా ఆకట్టుకున్నాడు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. శనివారం జరిగిన సబ్‌జూనియర్ బాలుర ఫైనల్లో 9 ఏళ్ల హరినాథ్ దత్తా 2–2, 3–2, 3–2తో దుర్గా ప్రేమ్ (వికారాబాద్)పై విజయం సాధించాడు. -
రాష్ట్ర స్థాయి తైక్వాండో చాంపియన్‌షిప్ షురూ
గచ్చిబౌలి : చీఫ్ మినిస్టర్స్ కప్ తెలంగాణ రాష్ట్ర తైక్వాండో చాంపియన్‌షిప్ పోటీలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, ‘శాట్స్’ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. తెలంగాణ తైక్వాండో సంఘం ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నీలో 31 జిల్లాలకు చెందిన 3000 మంది క్రీడాకారులు తలపడుతున్నారు. చాంపియన్‌షిప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గచ్చిబౌలి కార్పొరేటర్ సాయి బాబా, ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు కె. రంగారావు, కార్యదర్శి ప్రేమ్‌రాజ్, తెలంగాణ రాష్ట్ర తైక్వాండో సంఘం అధ్యక్షుడు మూట శ్రీనివాస్, కార్యదర్శి కె. శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
తైక్వాండోలో సారాఖాన్కు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: జాతీయ జూనియర్ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో రాష్ట్రానికి చెందిన మసీరా సారా ఖాన్ మెరిసింది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ టోర్నీలో సారా పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. మహిళల 63–68 వెయిట్ కేటగిరీలో ఆమె విజేతగా నిలిచింది. ఈ విజయంతో ఆమె అంతర్జాతీయ తైక్వాండో చాంపియన్‌షిప్‌కు ఎంపికైంది. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో రాణించిన సారా ఖాన్‌ను బుధవారం శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఖాతాలో 9 పతకాలు... జాతీయ స్కూల్ గేమ్స్ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర బృందం ఆకట్టుకుంది. నల్లగొండలో జరిగిన ఈ టోర్నీలో 3 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 9 పతకాలను సాధించింది. నందీశ్వర్ (21–23కేజీలు), హన్షిక సింగ్ (24–26 కేజీలు), హిమాన్షు (50 కేజీలు) ముగ్గురూ రన్నరప్‌లుగా నిలిచి రజతాలను సాధించారు. శివ కిరణ్ (25–27 కేజీలు), నైనా బాయి (18–20 కేజీలు), రమ్య (22–24 కేజీలు), త్రిలోక్ (32 కేజీలు), అక్షిత (38 కేజీలు), సంతోష్ (అండర్–18కేజీలు) కాంస్యాలను గెలుచుకున్నారు. -
తైక్వాండో చాంప్స్ ఆకాశ్, అక్షిత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా తైక్వాండో చాంపియన్‌షిప్‌లో ఆకాశ్ (యూటీఏ), అక్షిత (యూటీఏ)లు విజయం సాధించారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో జరిగిన ఈ టోర్నీ క్యాడెట్ బాలుర అండర్- 49 కేజీ విభాగంలో ఆకాశ్ (యూటీఏ) 3-2తో గౌతమ్ సింగ్ (సీటీసీ)పై గెలుపొందగా... బాలికల అండర్- 47 విభాగంలో ఎం. అక్షిత (యూటీఏ) 7-3తో నిధి (ఎస్టీసీ)ని ఓడించింది. ఇతర పోటీల్లో అండర్- 44 కేజీ కేటగిరీలో మనీశ్ (యూటీఏ) 5-3తో అనిత (జీటీఏ)పై, కృతి మలిక్ (మ్యాక్స్) 5-4తో తనుశ్రీ (ఐటీసీ)పై గెలుపొందారు. బాలుర విభాగంలో అండర్-33 కేజీ కేటగిరీలో రోహన్ (యూటీఏ) 5-4తో సౌరిశ్ (ఏఎంఆర్ఈఆర్)పై, అండర్-41 కేజీ కేటగిరీలో స్వరూప్ కిరణ్ (యూటీఏ) 7-3తో స్వపన్ (మ్యాక్స్)పై విజయం సాధించారు. సబ్ జూనియర్ బాలుర ఫలితాలు: అండర్-18 కేజీలు: 1. కర్మన్ సింగ్ (సీటీసీ), 2. కార్తీక్ (ఏఎంఈఈఆర్). అండర్-21 కేజీలు: 1. మానవ్ సింగ్ (సీటీసీ), 2. జశ్వంత్ (ఏఎంఈఈఆర్). అండర్- 23 కేజీ: 1. శివ్ కిరణ్ (సీటీసీ), 2. సంజయ్ నారాయణ (ఐటీసీ). అండర్-32 కేజీలు: 1. శివాన్ష అగర్వాల్ (మ్యాక్స్), 2. ఆకాశ్ అండర్-35 కేజీలు: 1. జి. రవిచంద్ర (ఐటీసీ), 2. నంద (ఏఎంఈఈఆర్).