హైదరాబాద్ ‘హాట్’! | Hyderabad hot! | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ ‘హాట్’!

Published Fri, Aug 23 2013 12:54 AM | Last Updated on Fri, Sep 7 2018 4:39 PM

హైదరాబాద్ ‘హాట్’! - Sakshi

హైదరాబాద్ ‘హాట్’!

 పుణే: స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ వరుస విజయాలకు తోడుగా... విదేశీ ఆటగాళ్లు అంచనాలకు మించి ఆడుతుండటంతో ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో హైదరాబాద్ హాట్‌షాట్స్ దూసుకుపోతోంది. గురువారం శివ్‌ఛత్రపతి బాలేవాడీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన మ్యాచ్‌లో 3-2 తో పటిష్టమైన ముంబై మాస్టర్స్‌ను కంగు తినిపించింది.
 
 దీంతో నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో 15 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఇక హాట్‌షాట్స్‌కు సెమీస్ బెర్త్ దాదాపుగా ఖరారైనట్లే. తొలి సింగిల్స్ ఆడిన అజయ్ జయరామ్ (హైదరాబాద్) 19-21, 21-11, 5-11తో లీ చోంగ్ వీ (ముంబై) చేతిలో ఓడాడు. 47 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జయరామ్ నెట్ వద్ద ఆకట్టుకున్నాడు.
 
 మహిళల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ సైనా నెహ్వాల్ 21-7, 21-10తో పీసీ తులసీపై అలవోకగా విజయం సాధించింది. స్మాష్‌లు, డ్రాప్ షాట్లతో అలరించిన ఈ హైదరాబాదీ కేవలం 28 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించింది. పురుషుల డబుల్స్‌లో వి షెమ్ గో-కిమ్ వాహ్ లిమ్ (హైదరాబాద్) జోడి 11-21, 21-16, 11-9తో సుమిత్ రెడ్డి-మను అత్రి (ముంబై)లపై; పురుషుల రెండో సింగిల్స్‌లో సీమ్‌సోమ్‌బున్సాక్ టంగ్‌సోక్ (హైదరాబాద్) 21-19, 17-21, 11-6తో మార్క్ జ్విబ్లెర్ (ముంబై)పై గెలిచి జట్టుకు 3-1తో విజయాన్ని అందించారు. తర్వాత జరిగిన మిక్స్‌డ్ డబుల్స్‌లో తరుణ్ కోనా-ప్రద్న్యా గాద్రె (హైదరాబాద్) 18-21, 19-21తో వ్లాదిమిర్ ఇవనోవ్-సిక్కి రెడ్డి (ముంబై)ల చేతిలో ఓడటంతో హైదరాబాద్ ఆధిక్యం 3-2కు తగ్గింది.
 
 ఆకట్టుకున్న జయరామ్
 తొలి గేమ్‌లో ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్‌వీతో మ్యాచ్‌లో ఓడినా హాట్‌షాట్స్ ఆటగాడు జయరామ్ ఆకట్టుకున్నాడు. తొలిగేమ్‌లో ఆఖరి పాయింట్ వరకూ పోరాడి ఓడినా... రెండో గేమ్‌లో చెలరేగాడు. ఆరంభంలో ఏకంగా 11-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లి అదే ఊపులో గేమ్ గెలిచాడు. అయితే కీలకమైన మూడో గేమ్‌లో లీ చోంగ్ వీ తన అనుభవాన్నంతా ప్రదర్శించి జయరామ్‌ను కట్టడిచేశాడు. ఈ ఒక్క గేమ్‌లోనే లీ చోంగ్ ఏకంగా 11 స్మాష్‌లు కొట్టడం విశేషం. అయితే జయరామ్ పోరాటపటిమకు లీ చోంగ్ వీ ముగ్దుడయ్యాడు.
 
 ఎట్టకేలకు అవధ్ గెలుపు
 
 ఢిల్లీకి మరో ఓటమి
 పుణే: ఐబీఎల్‌లో ఎట్టకేలకు అవధ్ వారియర్స్ బోణీ చేసింది. ఏపీ రైజింగ్ స్టార్స్ పి.వి. సింధు, శ్రీకాంత్, గురుసాయిదత్‌లు తమ సింగిల్స్ మ్యాచ్‌ల్లో  చెలరేగడంతో గురువారం రాత్రి జరిగిన పోరులో వారియర్స్ 4-1తో ఢిల్లీ స్మాషర్స్‌పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో శ్రీకాంత్ (వారియర్స్) తన రాష్ట్ర సహచరుడు సాయిప్రణీత్ (ఢిల్లీ)పై రెచ్చిపోయాడు. వరుస గేముల్లో 21-14, 21-9తో ప్రత్యర్థిని చిత్తు చేసి జట్టుకు శుభారంభాన్నిచ్చాడు. మహిళల సింగిల్స్‌లో సింధు (వారియర్స్) 21-16, 21-17తో అరుంధతి పంతవానే (ఢిల్లీ)ను కంగుతినిపించింది.
 
  స్మాష్‌లతో 9 పాయింట్లు గెలిచిన సింధు నెట్ వద్ద 14 పాయింట్లు సాధించింది. రెండు సింగిల్స్ విజయాలతో అవధ్ జట్టు 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. పురుషుల డబుల్స్‌లో కిన్ కీట్ కూ- బూన్ హోయెంగ్ తాన్  (ఢిల్లీ) జంట 21-16, 21-19తో మార్కిస్ కిడో- మథియాస్ బో (వారియర్స్) ద్వయంపై నెగ్గి అవధ్ ఆధిక్యాన్ని 2-1కు తగ్గించింది. పురుషుల సింగిల్స్ రెండో మ్యాచ్‌లో అవధ్ తరఫున బరిలోకి దిగిన గురుసాయిదత్ 21-16, 21-20తో డారెన్ ల్యూ (ఢిల్లీ)ని వరుస గేముల్లో కంగుతినిపించి 3-1తో వారియర్స్‌కు విజయాన్ని అందించాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో మార్కిస్ కిడో-బెర్నాడెట్ (వారియర్స్) జంట 21-20, 21-19తో వి.దిజు-ప్రజక్తా సావంత్ (ఢిల్లీ) జోడిపై నెగ్గింది.
 
 ఐబీఎల్‌లో నేడు
 పుణే పిస్టన్స్
 x
 బంగా బీట్స్
 రాత్రి గం. 8 నుంచి ఈఎస్‌పీఎన్‌లో లైవ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement