
ప్రతిసారీ గర్వపడతా
సాక్షి, హైదరాబాద్: దేశం తరఫున ఆడి గెలిచిన ప్రతీ పతకం ప్రత్యేకమైనదేనని, దేనికి ఎక్కువ విలువ అంటే చెప్పలేమని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేర్కొంది. పతకం గెలిచాక జాతీయ పతాకం ఎగిరిన ప్రతిసారీ గర్వపడతానని చెప్పింది. ఆసియా క్రీడల తర్వాత చైనా ఓపెన్ ఆడి హైదరాబాద్ వచ్చిన సానియా... సోమవారం మీడియాతో మాట్లాడింది. విశేషాలు ఆమె మాటల్లోనే... గత రెండు నెలలు
అద్భుతం: యూఎస్ ఓపెన్ నుంచి కాలం చాలా వేగంగా గడిచినట్లు అనిపించింది. ఆడిన ప్రతిచోటా విజయాలు వచ్చాయి. కొన్ని క్లిష్టమైన నిర్ణయాలు తీసుకున్నా. అన్నీ సరైన ఫలితాన్ని ఇచ్చాయి.
ఆసియా క్రీడల్లో పతకాలు: ఈసారి ఆసియా క్రీడల్లో స్వర్ణం... నాకు వ్యక్తిగతంగా ఎనిమిదో పతకం. వెళ్లిన ప్రతిసారీ మెడల్స్ సాధించినందుకు గర్వంగా ఉంది. నేను, సాకేత్ కలిసి సాధించిన స్వర్ణం చాలా ప్రత్యేకం. సాకేత్ తన ర్యాంక్ (189) కంటే చాలా మెరుగైన నైపుణ్యం ఉన్న ఆటగాడు. ఈ పతకంతో తనలో ఆత్మవిశ్వాసం పెరిగి మరిన్ని విజయాలు సాధిస్తాడని ఆశిస్తున్నాను. పాల్గొన్న తొలిసారే స్వర్ణం, రజతం గెలవడం గొప్ప ఘనత. అది సాకేత్ సాధించాడు. అలాగే మహిళల డబుల్స్‌లో తొలిసారి మనకు పతకం వచ్చింది. దేశంలో మహిళల టెన్నిస్ మెరుగుపడిందనడానికి ఇదే ఉదాహరణ.
సాకేత్ గురించి: మంచి వ్యక్తి. మేం కలిసి హైదరాబాద్‌లో గతంలో ప్రాక్టీస్ చేశాం. ఆసియా క్రీడల్లో ఆడాలని నిర్ణయం తీసుకోగానే ఎవరితో ఆడాలనే అంశం చర్చించాం. సాకేత్‌తో కలిసి ఆడిన తొలి మ్యాచ్‌లో కాస్త తడబడ్డాం. కానీ ఒక్క మ్యాచ్‌తోనే పరస్పరం అర్థం చేసుకున్నాం. అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. గతంలో ఆసియా క్రీడలకు వెళ్లిన ప్రతిసారీ జట్టులో నేనే యువ క్రీడాకారిణిగా ఉండేదాన్ని. ఇప్పుడు సీనియర్ క్రీడాకారిణిగా వెళ్లాను. ఈ క్రీడల్లో లభించిన అనుభవం, సాధించిన పతకాలతో... వచ్చే ఆసియా క్రీడల్లో ఈ యువ క్రీడాకారులంతా మరిన్ని పతకాలు సాధిస్తారనే విశ్వాసం ఉంది.
ఏ పతకం ప్రత్యేకం: దేశం తరఫున గెలిచిన ప్రతి పతకం ప్రత్యేకమే. టీమ్ ఈవెంట్లలో ఏ ఒక్కరి వల్లో విజయాలు రావు. సమష్టి కృషితోనే మంచి ఫలితాలు వస్తాయి. దేశం తరఫున పతకం గెలవగానే జాతీయ జెండా ఎగిరిన ప్రతిసారీ గర్వపడతా. ఆసియా క్రీడల్లో ఆడటం నేను తీసుకున్న మంచి నిర్ణయం.
విశ్రాంతి లేదు: ఎనిమిది వారాలుగా అస్సలు విశ్రాంతి దొరకలేదు. ఇప్పుడు కూడా ఎక్కువ విరామం లేదు. డబ్ల్యూటీఏ వరల్డ్ టూర్ ఫైనల్స్ ఆడటానికి 17న సింగపూర్ వెళుతున్నాను. గత ఏడాది ఐదు టైటిల్స్ గెలిచాను. అయితే ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాళ్లు ఏడాదికి 30 వారాల పాటు ఆడుతూనే ఉండాలి. విజయం వస్తే సంబరం చేసుకోవడానికి, ఓడిపోతే బాధపడటానికి కూడా సమయం దొరకదు.
ఎప్పటికీ హైదరాబాదీనే: నేను హైదరాబాద్ అమ్మాయిని. తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం గర్వకారణం. హైదరాబాద్‌తో, భారతదేశంతో నా అనుబంధం ఎప్పటికీ ఉంటుంది.
షోయబ్ హైదరాబాద్‌లో ఆడటం: తను నగరానికి వచ్చినప్పుడు నేను లేకపోవడం దురదృష్టమే. అయితే నేను ఆ సమయంలో దేశం తరఫున ఆడుతున్నాను. కాబట్టి ఎలాంటి బాధా లేదు. తను కూడా ఇక్కడ ఉన్న రోజులను బాగా ఆస్వాదించాడు.
కొత్త భాగస్వామి: కొన్ని కార ణాల వల్ల నేను, ప్రస్తుత భాగస్వామి కారా బ్లాక్ విడిపోయాం. ఇకపై మహిళల డబుల్స్‌లో చైనీస్ తైపీ అమ్మాయి సు వీ సెయితో కలిసి బరిలోకి దిగబోతున్నాను. సెయి ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో ర్యాంక్ క్రీడాకారిణి. కారా బ్లాక్ చాలా మంచి వ్యక్తి. తనతో నా స్నేహం ఎప్పటికీ కొనసాగుతుంది.