
ఈ ఏడాది కలిసొచ్చింది
న్యూఢిల్లీ: ఈ ఏడాది తనకు బాగా కలిసొచ్చిందని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తెలిపింది. శనివారం ముగిసిన చైనా ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నమెంట్‌లో ఆమె కారా బ్లాక్ (జింబాబ్వే)తో కలిసి డబుల్స్ టైటిల్ నెగ్గిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో ఆమె సాధించిన ఐదో టైటిలిది. ఈ నేపథ్యంలో హైదరాబాదీ స్టార్ మాట్లాడుతూ... గతేడాది కంటే ఈ ఏడాదే తన ఆటతీరు, విజయాల శాతం మెరుగయ్యాయని చెప్పింది. ‘మొత్తం మీద నా ప్రదర్శన బాగా మెరుగైంది. గత సీజన్‌తో పోల్చుకుంటే ఒక్క ఫిట్‌నెసే కాదు... ఆటతీరుతో సహా అన్నింట్లో పరిస్థితి మెరుగైంది.
కారాతో కలిసి చక్కని విజయాలు సాధించాను. మా జోడి సరిపోయింది. కోర్టుల్లో మా సమన్వయం కుదరడంతో నిలకడైన విజయాలు దక్కుతున్నాయి. వచ్చే సీజన్ అంతా ఆమెతోనే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాను’ అని సానియా తెలిపింది. ముఖ్యంగా కారాతో కలిసి ఆమె తొమ్మిది మ్యాచ్‌ల్లో అజేయ జైత్రయాత్ర కొనసాగించింది. ఈ ద్వయం జపాన్ ఓపెన్, చైనా ఓపెన్‌లలో వరుస టైటిళ్లు సాధించింది.