రవిశాస్త్రి, సెహ్వాగ్ లు పోటీ కాదు..
న్యూఢిల్లీ: మరో రెండు రోజుల్లో భారత క్రికెట్ జట్టుకు కొత్త కోచ్ రాబోతున్న సంగతి తెలిసిందే. జూలై 10వ తేదీన బీసీసీఐ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) నూతన కోచ్ ను ఎంపిక చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ తరుణంలో అసలు కోచ్ పదవి ఎవర్ని వరించబోతున్నది అనే దానిపై ఆసక్తి నెలకొంది. ప్రధానంగా టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి, మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ ఇద్దరికి బీసీసీఐలోని పెద్దల అండదండలు ఉన్నాయనే వార్తల నేపథ్యంలో కోచ్ పదవి అనేది ఇద్దరిలో ఒకరికి ఖాయంగా కనబడుతోంది. అయితే కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసిన మరో మాజీ భారత ఆటగాడు లాల్చంద్ రాజ్పుత్ కూడా రేసులోకి వచ్చాడు. గతంలో భారత జట్టుతో కలిసి పని చేసిన అనుభవం ఉన్న రాజ్ పుత్.. కోచ్ పదవిపై స్పందించాడు.
'ఇక్కడ రవిశాస్త్రి, సెహ్వాగ్ల నుంచి మాత్రమే పోటీ ఉందని అనుకోవడం లేదు. వారిద్దరికీ నేను పోటీ కూడా కాదు. కోచ్ ను ఎంపిక చేసే సచిన్, గంగూలీ, లక్ష్మణ్లతో కూడిన సీఏసీ ఎవరు బెస్ట్ అనేది నిర్ణయిస్తుంది. నా వరకూ అయితే నాపై నమ్మకం ఉంది. నా రికార్డులే నా గురించి చెబుతాయి. నేను భారత క్రికెటర్లతో కలిసి పని చేసిన 2007వ సంవత్సరమే అందుకు ఉదాహరణ. నాకొక సొంత గుర్తింపు కూడా. ఇక్కడ నాలాగే కోచ్ గా దరఖాస్తు చేసిన అందరికీ సొంత గుర్తింపు ఉంది. కోచ్ గా ఎవరైతే అర్హలని సీఏసీ భావిస్తుందో వారికే ఇవ్వండి. అంతేకానీ కొంతమంది నుంచి పోటీ ఉందని అనడం సబబు కాదు.'మేమంతా కోచ్ కాంపిటేషన్ లో ఉన్నాం. దొడ్డ గణేష్, రిచర్డ్ పైబస్, టామ్ మూడీలు కూడా పోటీలో ఉన్నారు' అని లాల్ చంద్ రాజ్పుత్ పేర్కొన్నాడు.
2007లో రాజ్పుత్ పర్యవేక్షణలోని భారత జట్టు వన్డే సిరీస్ ను, టెస్టు సిరీస్ను గెలవగా, 2008లో ఆస్ట్రేలియాలో జరిగిన ముక్కోణపు సిరీస్ను కూడా సొంతం చేసుకుంది.