'అతడి కంటే నేనే బెస్ట్'
న్యూఢిల్లీ: ప్రపంచంలో తానే ఫాస్టెస్ట్ అథ్లెట్ అని విండీస్ విధ్వంసకర బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ అన్నాడు. జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ కంటే తానే వేగంగా పరుగెత్తుతానని సరదాగా అన్నాడు. టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో కలిసి గేల్ సోమవారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ధోని తెలిపాడు. ఈ సందర్భంగా ధోని అడిగిన ప్రశ్నకు గేల్ తనదైన శైలిలో సమాధానాలిచ్చాడు.
ఈ భూమి మీద వేగంగా పరిగెత్తే అథ్లెట్ ఎవరని ధోని అడగ్గా... 'బోల్డ్ క్రికెట్ ఆడలేడు, నేను మాత్రం అతడికంటే వేగంగా పరుగెత్తగలను. ఏదోక రోజు ఈ అవకాశం వస్తుందని ఆశిస్తున్నా. అయితే ఇది ఎప్పటికి జరగదు' అంటూ చమత్కరించాడు. వికెట్ల మధ్య తనకంటే వేగంగా పరుగెత్తే క్రికెటర్ ఎవరూ లేరని గేల్ అన్నాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తడంలో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ నా తర్వాతే ఉంటాడని సరదాగా అన్నాడు.
కాగా, సొంతగడ్డపై టెస్టుల్లో టీమిండియాను ఓడించడం కష్టమని గేల్ అభిప్రాయపడ్డాడు. స్పిన్ బౌలింగ్ లో ఇండియా కింగ్ అని పేర్కొన్నాడు. 2016 వరల్డ్ టి20 ప్రపంచకప్ లో భారత్ ఫేవరేట్ అని అన్నాడు.