'బీసీసీఐ నిర్ణయంతో షాకయ్యా'
న్యూఢిల్లీ: తనను సస్పెండ్ చేస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేసిందని ముంబై రంజీ క్రికెటర్ హికెన్ షా(30) ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఎటువంటి అవినీతికి పాల్పడకపోయినా బీసీసీఐ తీసుకున్న తాజా నిర్ణయం విస్మయానికి గురి చేసిందన్నాడు. తాను ప్రవీణ్ తాంబేను కలిసిన మాట వాస్తవమే అయినా.. కోచింగ్ కోసమే అతన్ని కలిసినట్లు హికెన్ తెలిపాడు. 'నేనెప్పుడూ అవినీతికి పాల్పడలేదు. దానిపై ఇప్పటికే బీసీసీఐకి వివరణ ఇచ్చా. నేను తప్పుచేయలేదని మాత్రమే బీసీసీఐకి చెప్పగలను. అంతకుమించి నావద్ద సమాధానం కూడా ఏమీ లేదు. బీసీసీఐ తీసుకున్న ఆకస్మిక నిర్ణయంతో నేను షాక్ తిన్నా' అని హికెన్ తెలిపాడు.
ప్రస్తుతం హీకెన్ ఇంగ్లండ్ కౌంటీ క్లబ్ లాంక్ షైర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా, హికెన్ షాపై గత ఐపీఎల్ సందర్భంగా వచ్చిన అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో అతడిని బీసీసీఐ సస్పెండ్ చేసింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అతడిపై తదుపరి చర్య కోసం ఈ అంశాన్ని క్రమశిక్షణ సంఘానికి అప్పగించింది. ఐపీఎల్ లో ఓ జట్టు తరపున ఆడుతున్న తన తోటి క్రికెటర్ కు లంచం ఇవ్వచూపాడని అతడిపై ఆరోపణలు వచ్చాయి. బీసీసీఐ అవినీతి నిరోధక నిబంధనావళిని హికెన్ షా ఉల్లంఘించినట్టు రుజువు కావడంతో అతడిని సస్పెండ్ చేసినట్టు బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ థాకూర్ తెలిపారు. హికెన్ షా ముంబై తరపున 37 ఫస్ట్ క్లాచ్ మ్యాచ్ లు ఆడి 42.35 సగటుతో 2160 పరుగులు చేశాడు. అయితే హికెన్ ఏ ఐపీఎల్ జట్టు తరుపున ఆడకపోవడం గమనార్హం.