
ఆ సత్తా నాలో ఉంది: నెహ్రా
న్యూఢిల్లీ: తన వయసు పైబడుతున్నా సత్తా ఏమాత్రం తగ్గలేదని అంటున్నాడు భారత వెటరన్ పేస్ బౌలర్ ఆశిష్ నెహ్రా. ఏ ఫార్మాట్ లోనైనా 140 కి.మీ వేగంతో బౌలింగ్ వేయగల సత్తా ఉందని నెహ్రా పేర్కొన్నాడు. 'వచ్చే నెలకు 38వ ఒడిలో అడుగుపెడుతున్న నేను ఇంకా ఫాస్ట్ బౌలర్ గానే ఉన్నా. నేను ఎప్పుడూ 125-128 కి.మీ వేగం తగ్గకుండా బౌలింగ్ వేస్తూ వస్తున్నా. ఈరోజుకీ కొత్త బంతితో 138 కి.మీ వేగంతో బంతిని సంధించాలనేదే నా లక్ష్యం. దాన్ని సాధించి చూపెడతా. ఇక్కడ వేగం అనేది ముఖ్యం కాకపోయినా, అవసరమైతే 140కి.మీ వేగాన్ని అందుకుంటా 'అని నెహ్రా ధీమా వ్యక్తం చేశాడు.
అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ ఎవరైనా అతనిపై ఒత్తిడి లేదని చెబితే మాత్రం అది అబద్ధమేనని నెహ్రా స్పష్టం చేశాడు. ప్రస్తుతం తనపై ఒత్తిడి కంటే కూడా ఒక సీనియర్ క్రికెటర్ గా ఒక బాధ్యత ఉందని నెహ్రా పేర్కొన్నాడు. యువ క్రికెటర్లకు అమూల్యమైన సలహాలిస్తూ వారి కెరీర్ కు సహకరించడమే తన ముందున్న టార్గెట్ అని తెలిపాడు. అయితే 2019 వరల్డ్ కప్ లో ఆడతారా? అనే దానికి మాత్రం నెహ్రా నో అనే సమాధానమే చెప్పాడు. అప్పటికి తాను దాదాపు 40 ఏళ్లకు దగ్గరయ్యే క్రమంలో ఆడటం కష్టమేనన్నాడు.