అపజయాలే ముందుకు నడిపాయి
ముంబై: దశాబ్దాల తన కెరీర్‌లో చెస్ మేధావి విశ్వనాథన్ ఆనంద్ ఎన్నో ఎత్తుపల్లాలను చవి చూశాడు. అయితే ఎలాంటి ఫలితాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో ముందుకు సాగడమే తనకు తెలుసని చెబుతున్నాడు. సాధించిన విజయాలను మర్చిపోయి మరో కొత్త లక్ష్యం కోసం ఎదురుచూడాలని ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన 45 ఏళ్ల ఆనంద్ అన్నాడు. ‘అత్యున్నత స్థాయికి ఎదగాలంటే తొలి నిబంధన స్వయం తృప్తి పొందకపోవడం.
ఇంకా ఏదో నేర్చుకోవాలనే తపన, వినయం ఎవరికైనా ఉండాలి. నేను మూడుసార్లు ప్రయత్నించాకే ప్రపంచ చాంపియన్ కాగలిగాను. అపజయాలు నాలో ప్రేరణను కలిగించాయి. ఆ తర్వాత ప్రయత్నాలన్నీ అనుకూలంగా వచ్చాయి. తొలిసారిగా విశ్వ చాంపియన్ అయ్యాక కాస్త సంతృప్తి చెందాను. ఇది ఆ తర్వాత పోటీలపై ప్రభావం పడింది. ఎలాంటి అంచనాలు లేకుండా ఆడితేనే బావుంటుంది. నిజానికి ఎవరు ఏ విషయంలోనూ మాస్టర్ కాలేరు’ అని ఆనంద్ అన్నాడు.