'ఆ క్రికెటర్ ఆట కోసం ఎదురుచూస్తున్నా'
న్యూఢిల్లీ:టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్పై శ్రీలంక దిగ్గజ ఆటగాడు సనత్ జయసూర్య ప్రశంసలు కురిపించాడు. శిఖర్ ధావన్ ఎటాక్ ను చూస్తుంటే తాను క్రికెట్ ఆడిన రోజులు గుర్తుస్తున్నాయన్నాడు. గతంలో తన ఎటాక్ కు, ప్రస్తుత ధావన్ ఎటాక్ కు చాలా పోలికలున్నాయని జయసూర్య అభిప్రాయపడ్డాడు. తమ జట్టుతో జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో భారీ సెంచరీ చేసిన ధావన్ ఆటను ఎంతగానో ఎంజాయ్ చేశానన్నాడు. అదే క్రమంలో అతని ఆట కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానని జయసూర్య స్పష్టం చేశాడు.
తొలి టెస్టులో గెలిచిన భారత జట్టు ప్రదర్శన సైతం తనను ఎంతగానో ఆకట్టుకుందన్నాడు. చివరిసారి లంకలో పర్యటించి గాలే టెస్టులో ఓటమిని ఎదుర్కొన్న భారత్.. దానికి ఘనమైన ప్రతీకారం తీర్చుకుందన్నాడు. స్వదేశంలో అత్యంత ప్రమాదకరమైన జట్టైన తమను భారత్ ఓడించిందంటే అందుకు వారి సమష్టి పోరాటమే ప్రధానకారణమన్నాడు.
ఈ సందర్భంగా గతేడాది ఆస్ట్రేలియాపై వరుసగా మూడు టెస్టు మ్యాచ్ లు గెలిచిన సంగతిని జయసూర్య గుర్తుచేశాడు. అప్పటి నంబర్ వన్ ఆస్ట్రేలియాను చుట్టేసిన తమ జట్టు.. ఇప్పుడు నంబర్ వన్ గా ఉన్న భారత్ కు సునాయాసంగా లొంగిపోవడాన్ని సమర్ధించుకున్నాడు. ఇది క్రికెట్ అని, ఏదైనా ఈ గేమ్ లో సాధ్యమేనన్నాడు. తమ జట్టు తిరిగి పుంజుకుంటుందని జయసూర్య ఆశాభావం వ్యక్తం చేశాడు. దాదాపు ఆరేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ కు జయసూర్య గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. జయసూర్య 110 టెస్టులు, 445 వన్డేలు, 31 ట్వంటీ 20లు ఆడాడు. 1996లో లంకేయులు వన్డే వరల్డ్ కప్ గెలవడంలో జయసూర్యదే ముఖ్య భూమిక. పవర్ ప్లే ఎలా ఆడాలో ప్రపంచానికి పరిచయం చేసింది జయసూర్యనే అనడంలో ఎటువంటి సందేహం లేదు.