అప్పుడు కంటే ఇప్పుడే నయం:శిఖర్
న్యూఢిల్లీ: గడిచిన ఎనిమిది నెలల్లో తాను బ్యాటింగ్ లో ఎంతో పరిణితి సాధించానని అంటున్నాడు టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్. గతంలో తనలో నిలకడలేమి ఎక్కువగా ఉండేదని.. అది ఈ మధ్య కాలంలో చాలా మెరుగుపడిందని స్పష్టం చేశాడు. గత రెండు సంవత్సరాల క్రితం టెస్టులో ఆరంగేట్రం చేసిన తాను తొలుత బ్యాటింగ్ చేయడంలో పలు ఇబ్బందులను ఎదుర్కొనేవాడినని తెలిపాడు. 2015 వరల్డ్ కప్ నుంచి తన ఆటలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయన్నాడు. ఆ మెగా ఈవెంట్ లో 412 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానం సాధించడమే ఇందుకు నిదర్శమని శిఖర్ పేర్కొన్నాడు.
'నా ఆటతీరు గడిచిన ఏడు-ఎనిమిది నెలల నుంచి నిలకడగా ఉంది. కొన్ని మంచి స్కోర్లు సాధిస్తూ జట్టుకు ఉపయోగపడుతున్నా. 2013 లో ఆస్ట్రేలియాతో టెస్టు కెరీయర్ ఆరంభించిన నాటి కంటే ఇప్పుడు బాగా మెరుగయ్యా. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ లో వరుసగా రెండు సెంచరీలు చేసి ఆకట్టుకున్నా. అయితే గాలే టెస్టులో గాయం కారణంగా రెండు టెస్టు మ్యాచ్ లకు దూరమయ్యా. అది నన్ను ఎక్కువగా బాధించింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ల నుంచి కొన్ని గుణపాఠాలు నేర్చుకున్నా. సాధించిన విజయాల కంటే ఓటమి నుంచే ఎక్కువగా నేర్చుకోవచ్చన్నది అక్షరసత్యం. త్వరలో బంగ్లాదేశ్ -ఎ తో జరుగనున్న మూడు రోజుల మ్యాచ్ కు సన్నద్ధమవుతున్నా. ఇంకా నెట్స్ లో ప్రాక్టీస్ చేయడం లేదు. సెప్టెంబర్ 27 వ తేదీన ఫిట్ నెస్ ను నిరూపించుకుని మళ్లీ బరిలోకి దిగడానికి సిద్ధమవుతా' అని ధవన్ స్పష్టం చేశాడు.