
న్యూఢిల్లీ:గత కొన్నేళ్లుగా భారత క్రికెట్ సారథి విరాట్ కోహ్లి-బాలీవుడ్ నటి అనుష్క శర్మలు ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబుతున్నారనే వార్తలు కూడా బాగా ఊపందుకున్నాయి. అయితే అనుష్క శర్మతో రిలేషన్షిప్ లో భాగంగా మూడేళ్ల క్రితం మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ ఇచ్చిన సలహా తనకు ఎంతగానో ఉపయోగపడిందని కోహ్లి తాజాగా పేర్కొన్నాడు.
'2014 ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా అనుష్క శర్మ నాతో పాటే వచ్చింది. ఆ సిరీస్ లో నేను సరిగా రాణించలేకపోయా. దాన్ని టార్గెట్ చేస్తూ ఒక వర్గం నెటిజన్లు మాపై విమర్శల వర్షం కురిపించారు. నేను రాణించకపోవడానికి అనుష్క శర్మ రావడమే కారణమంటూ సెటైర్లు గుప్పించారు. నేను విఫలమైన ప్రతీసారి అనుష్కను టార్గెట్ చేస్తూ వార్తలు రాశారు. అదే క్రమంలో నాకు ఫ్యాషన్ పై మోజు పెరిగిందంటూ ఛలోక్తులు విసిరారు. నా వైఫల్యాలకు అనుష్కను నిందిస్తున్న సమయంలో ఓసారి జహీర్ ఖాన్ తో మాట్లాడా. అప్పుడు అతను ఓ విషయం చెప్పాడు. నీవు ఏదీ దాచాలని ప్రయత్నించకు. నువ్వు దాచేందుకు యత్నిస్తే ఇంకా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రహస్యంగా ఉంచడానికి నువ్వు నేరం చేయలేదు కదా అని జహీర్ చెప్పాడు. ఆనాటి జహీర్ మాటలే నాకు చాలా ఉపయోగపడ్డాయి. మాపై నిందలు వేస్తున్న సమయంలో జహీర్ తో మాట్లాడం ఎంతో ఊరటనిచ్చింది'అని కోహ్లి తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment