
మాస్కో: టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన అర్జెంటీనా ఈసారి తప్పకుండా వరల్డ్‌కప్ గెలుస్తుందని ఫుట్‌బాల్ దిగ్గజం డిగో మారడోనా విశ్వాసం వ్యక్తం చేశాడు. ఫిఫా వరల్డ్‌కప్ 2018లో అర్జెంటీనాను విజేతగా నిలిపిన తర్వాత మెస్సీలో ఆనందాన్ని చూడాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. గత ప్రపంచకప్ ఫైనల్లో జర్మనీ చేతిలో అర్జెంటీనా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2015, 2016 కోపా అమెరికా టోర్నీ ఫైనల్స్‌లోనూ అర్జెంటీనా ఓడిపోయింది. అయితే వాటికి సంబంధం లేకుండా 32ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణకు మెస్సీ ఈసారి తెరదించుతాడని ఈ దిగ్గజ ఫుట్ బాలర్ ధీమా వ్యక్తం చేశాడు. ఓ ప్రముఖ వార్తా పత్రికకు వ్యాసం రాసిన మారడోనా.. మెస్సీ గురించి ప్రధానంగా ప్రస్తావించాడు.
‘ఈసారి అర్జెంటీనా కప్ గెలుస్తుందని చెప్పడానికి నేనేమీ విశ్లేషణలు చేయడం లేదు. మరోవైపు మెస్సీ కూడా కప్ గెలవడం ద్వారా తన గొప్పతనాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కానీ, కప్ గెలవాలని అతను బలంగా కోరుకుంటున్నాడు. అదే అర్జెంటీనా జట్టుకు ప్రధాన బలం. క్షణాల్లో మ్యాచ్ దిశను మలుపు తిప్పగల సత్తా అతనిలో ఉంది. అయితే ప్రపంచకప్ గెలిచిన తర్వాత అప్పటి భావోద్వేగ క్షణాల గురించి వర్ణించడం చాలా కష్టం. వాటిని మెస్సీ కూడా తప్పకుండా అనుభవించాలని కోరుకుంటున్నా’ అని మారడోనా రాసుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment