ఆమ్ ఆద్మీ కోసం భారత్ తరపున బ్యాటింగ్: సచిన్
ఆమ్ ఆద్మీ కోసం భారత్ తరపున బ్యాటింగ్: సచిన్
Published Tue, Feb 4 2014 2:44 PM | Last Updated on Sat, Sep 2 2017 3:20 AM
ఆమ్ ఆద్మీ ముఖంపై చిరునవ్వులు చిందించేందుకు భారత్ తరపున తాను బ్యాటింగ్ కొనసాగిస్తాను అని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా సచిన్ భారత రత్న పురస్కారాన్ని అందుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. క్రికెట్ ఆటలో కొనసాగకపోయినా ప్రజలకు మంచి చేసేందుకు తాను భారత్ దేశం తరపున బ్యాటింగ్ చేస్తాను అని సచిన్ చమత్కరించారు.
భారత రత్న పురస్కారం తనకు లభించిన అత్యున్నత పురస్కారం. ఈ అవార్డును అందుకోవడంతో ఆనందం అవధులు దాటుతోంది అని సచిన్ అన్నారు. నవంబర్ 16 తేదిన అంతర్జాతీయ క్రికెట్ నుంచి సచిన్ తప్పుకున్న సంగతి తెలిసిందే. 'తమ పిల్లల భవిష్యత్ కోసం సర్వ అర్పించే తల్లితండ్రులకు, తన తల్లికి ఈ అవార్డును అంకితం చేస్తున్నాను' అని సచిన్ అన్నారు.
రాష్ట్రపతిభవన్ లోని దర్బార్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో భారత శాస్త్రజ్క్షుడు సీఎన్ఆర్ రావు, క్రికెటర్ సచిన్ టెండూల్కర్ లకు ప్రణబ్ భారతరత్న పురస్కారాలను అందచేశారు. ఈ కార్యక్రమానికి సచిన్ సతీమణి అంజలి, కూతురు సారా, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీలతోపాటు పలువురు హాజరయ్యారు.
Advertisement