
నా గెలుపుపై నమ్మకం ఉంది:అజహరుద్దీన్
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) అధ్యక్ష పదవికి భారత మాజీ కెప్టెన్ మొహ్మద్ అజహరుద్దీన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు మంగళవారం అజహర్ తన నామినేషన్ వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అజహరుద్దీన్.. తన గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోవు హెచ్సీ ఎన్నికల్లో గెలుస్తాననే నమ్మకం ఉందన్నారు. లోధా సిఫారుల మేరకే తాను నామినేషన్ వేసినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుతం హెచ్సీఏ అనేది నగరాలకే పరిమితమైందన్న అజహర్.. తన గెలుపు కోసం తెలంగాణ మంత్రి కేటీఆర్ మద్దతు కోరనున్నట్లు తెలిపారు.
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో అజహర్‌పై బీసీసీఐ 2000 సంవత్సరంలో జీవితకాలం నిషేధం విధించగా, దాదాపు 12 ఏళ్ల తర్వాత ఏపీ హైకోర్టు బోర్డు నిర్ణయాన్ని తప్పు పడుతూ అజహర్‌ను నిర్దోషిగా తేల్చింది. అయితే ఆ తర్వాత కూడా బీసీసీఐ అధికారికంగా అజహర్‌పై నిషేధాన్ని ఎత్తివేయకపోవడం గమనార్హం.