ఐఏఏఎఫ్ అధ్యక్షుడిగా సెబాస్టియన్ కో | IAAAF president Sebastian Coe | Sakshi
Sakshi News home page

ఐఏఏఎఫ్ అధ్యక్షుడిగా సెబాస్టియన్ కో

Published Thu, Aug 20 2015 12:33 AM | Last Updated on Sun, Sep 3 2017 7:44 AM

ఐఏఏఎఫ్ అధ్యక్షుడిగా సెబాస్టియన్ కో

ఐఏఏఎఫ్ అధ్యక్షుడిగా సెబాస్టియన్ కో

బీజింగ్ : బ్రిటన్ దిగ్గజ అథ్లెట్, ఒలింపిక్ మాజీ చాంపియన్ సెబాస్టియన్ కో అంతర్జాతీయ అథ్లెటిక్స్ సంఘాల సమాఖ్య (ఐఏఏఎఫ్) కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో సెబాస్టియన్ కోకు 115 ఓట్లు రాగా... ఆయన ప్రత్యర్థి, ఉక్రెయిన్ పోల్‌వాల్ట్ దిగ్గజం సెర్గీ బుబ్కాకు 92 ఓట్లు వచ్చాయి. 16 ఏళ్లుగా ఈ పదవిలో ఉన్న లామైన్ డియాక్ (సెనెగల్) స్థానంలో ఆగస్టు 31న కో బాధ్యతలు స్వీకరిస్తారు. 58 ఏళ్ల సెబాస్టియన్ కో 1980 మాస్కో, 1984 లాస్‌ఏంజిల్స్ ఒలింపిక్స్‌లలో 1500 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకాలు సాధించారు. అంతేకాకుండా ఎనిమిది అవుట్‌డోర్, మూడు ఇండోర్ ప్రపంచ రికార్డులను సృష్టించారు.

అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన సెర్గీ బుబ్కా ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బుబ్కాతోపాటు దహ్లాన్ అల్ హమాద్ (ఖతార్), హమాద్ కల్కాబా మల్బూమ్ (కామెరూన్), అల్బెర్టో యువాన్‌టొరెనా (క్యూబా) ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఇదే ఎన్నికల్లో భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) అధ్యక్షుడు అదిల్లె సుమరివల్లా ఐఏఏఎఫ్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

Advertisement
Advertisement