వెస్టిండీస్ చివరిసారిగా ప్రపంచ కప్ గెలిచింది 1979లో...! అది కూడా ఫైనల్లో ఇంగ్లండ్‌పై విజయంతో! ఆ తర్వాత రెండు జట్లు గత 40 ఏళ్లలో కప్‌లో మరో ఐదుసార్లు ఎదురుపడ్డాయి. కానీ, వెస్టిండీస్‌కు ఇంగ్లండ్‌పై నెగ్గడం గగనమైంది. ప్రస్తుతం మరోసారి అమీతుమీకి సిద్ధమయ్యాయి. మరి... పైచేయి టోర్నీ హాట్ ఫేవరెట్, మోర్గాన్ నేతృత్వంలోని ఆతిథ్య జట్టుదా? హోల్డర్ సారథ్యంలోని కరీబియన్లదా? నేడే చూడాలి...!
సౌతాంప్టన్: ప్రపంచ కప్‌లో ఓ ఆసక్తికర సమరం. ధనాధన్ ఆటకు పేరుగాంచిన ఇంగ్లండ్–వెస్టిండీస్‌లు సౌతాంప్టన్‌లోని రోజ్‌బౌల్ మైదానం వేదికగా శుక్రవారం తలపడనున్నాయి. ఆతిథ్య జట్టు భీకర ఫామ్‌తో అదరగొడుతున్నా, సమష్టిగా ఆడితే ఎలాంటి ప్రత్యర్థినైనా ఓడించే సత్తా ఉన్నవారు కరీబియన్లు. కప్‌లో ఇరు జట్లకు ఇది నాలుగో మ్యాచ్. రెండు విజయాలు, ఒక ఓటమితో ఇంగ్లండ్ నాలుగు పాయింట్లతో ఉండగా, ఒక విజయం, ఒక ఓటమి, ఒక మ్యాచ్ రద్దుతో విండీస్ ఖాతాలో మూడు పాయింట్లున్నాయి. ఇటీవలి కాలంలో వన్డేల్లో ఇంగ్లండ్‌కు దీటుగా నిలిచినది వెస్టిండీసే కావడం గమనార్హం.
వీటి మధ్య ఫిబ్రవరిలో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్ 2–2తో సమమవడమే దీనికి నిదర్శనం. మరోవైపు విండీస్ దీవుల్లోని ఓ భాగమైన బార్బడోస్‌లో జన్మించి ఇంగ్లండ్‌కు ఆడుతున్న పేసర్ జోఫ్రా ఆర్చర్‌ను యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఎలా ఎదుర్కొం టాడన్నది ఈ మ్యాచ్‌లో ఆసక్తికర అంశం కానుంది. కీలక బ్యాట్స్‌మన్ జాస్ బట్లర్ ఫిట్‌నెస్ సాధించడం ఇంగ్లండ్‌కు ఊరటనిస్తోంది. ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ మోకాలి గాయం విండీస్‌ను కలవరపరుస్తోంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో అతడు లేకుండానే జట్టు బరిలో దిగింది. రసెల్ కోలుకుంటే తప్పక ఆడించాలని జట్టు భావిస్తోంది.
జోరులో మోర్గాన్ సేన
టోర్నీ తొలి మ్యాచ్‌లో సఫారీలను తేలిగ్గానే ఓడించిన ఇంగ్లండ్‌కు రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్ షాకిచ్చింది. ఈ ప్రభావం నుంచి వెంటనే కోలుకున్న ఆ జట్టు బంగ్లాదేశ్‌పై భారీ విజయం సాధించింది. పేస్, అదనపు బౌన్స్‌తో ప్రత్యర్థి పేసర్లు కాట్రెల్, థామస్, హోల్డర్ మంచి లయలో బౌలింగ్ చేస్తుండటంతో నేటి మ్యాచ్ వారికి సవాలే కానుంది. ఓపెనర్ జేసన్ రాయ్, జో రూట్, బట్లర్ ఫామ్‌లో ఉండటంతో మిగతావారు పెద్దగా పరుగులు చేయకున్నా సాగిపోతోంది. మరో ఓపెనర్ బెయిర్ స్టో, కెప్టెన్ మోర్గాన్ తమ స్థాయి ఇన్నింగ్స్ బాకీ ఉన్నారు. బౌలింగ్‌లో ఆర్చర్ ఏమాత్రం అవకాశం లేనంతగా బంతులేస్తున్నాడు. రషీద్ స్పిన్ మధ్య ఓవర్లలో కీలకం. మొదట బ్యాటింగ్ దక్కితే ఇంగ్లండ్‌ను అందుకోవడం ఎవరి తరం కాదు.
విండీస్‌కు బ్యాటింగే బెంగ
బౌలింగ్ ఎంత బలంగా ఉందో... విండీస్ బ్యాటింగ్ అంత అనిశ్చితితో సాగుతోంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ బ్యాట్స్‌మెన్ వైఫల్యం కారణంగానే చేజారింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ రద్దు జట్టు అవకాశాలకు కొంత గండి కొట్టింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌పై గెలుపు కీలకం కానుంది. విధ్వంసక క్రిస్ గేల్ ఇంకా పూర్తిస్థాయిలో విజృంభించలేదు. ఓపెనర్ ఎవిన్ లూయిస్ ఫామ్‌లో లేడు. భారీ స్కోర్లు చేయాలన్నా, ఛేదించాలన్నా వీరితో పాటు కుర్రాళ్లు పూరన్, హెట్‌మైర్ రాణించాల్సి ఉంటుంది. సౌతాంప్టన్‌లో శుక్రవారం వర్షం కురిసే అవకాశం ఉంది. దీని ప్రభావం మ్యాచ్‌పై పడొచ్చు.
ముఖాముఖి రికార్డు
ఇరు జట్లు ఇప్పటివరకు 101 మ్యాచ్‌ల్లో ఎదురుపడ్డాయి. ఇంగ్లండ్ 51 మ్యాచ్‌ల్లో గెలుపొందగా... వెస్టిండీస్ 44 గెలిచింది. ఆరుమ్యాచ్‌లు రద్దయ్యాయి. ప్రపంచ కప్‌లో మాత్రం ఇంగ్లండ్‌దే పూర్తిగా పైచేయి. విండీస్‌తో ఆరుసార్లు తలపడగా... ఐదుసార్లు ఇంగ్లండే నెగ్గింది. ఒక్కదాంట్లోనే కరీబియన్లు (1979 ప్రపంచ కప్ ఫైనల్) విజయం సాధించగలిగారు.
ఇంగ్లండ్‌కు సవాల్
Published Fri, Jun 14 2019 4:54 AM | Last Updated on Fri, Jun 14 2019 4:54 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment