అఫ్గానిస్తాన్‌ 0 | West Indies beat Afghanistan by 23 runs | Sakshi
Sakshi News home page

అఫ్గానిస్తాన్‌ 0

Published Fri, Jul 5 2019 4:57 AM | Last Updated on Fri, Jul 5 2019 4:59 AM

West Indies beat Afghanistan by 23 runs - Sakshi

ప్రపంచ కప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో  అఫ్గానిస్తాన్‌ చేతిలో తమకెదురైన పరాజయానికి వెస్టిండీస్‌ బదులు తీర్చుకుంది. బ్యాట్స్‌మెన్‌ సమష్టిగా రాణించడంతో తొలుత భారీ స్కోరు చేసిన కరీబియన్లు... బౌలింగ్‌లో కీలక సమయంలో వికెట్లు తీసి గెలుపొందారు. మ్యాచ్‌లో ఓడినా అఫ్గాన్‌ పోరాటంతో ఆకట్టుకుంది. యువ ఇక్రమ్‌ చక్కటి బ్యాటింగ్‌తో అలరించాడు.

లీడ్స్‌: ఈ కప్‌ కంటే ముందు క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌ ఫైనల్లో విండీస్‌పై గెలిచిన అఫ్గానిస్తాన్‌ ‘హీరో’గా  మెగా ఈవెంట్‌కు అర్హత సాధించింది. ఇప్పుడదే ప్రత్యర్థిపై గెలవడం ద్వారా వెస్టిండీస్‌... అఫ్గాన్‌ను ‘జీరో’గా మార్చింది. ఒక్క సంచలన విజయమూ లేకుండానే, ఆడినవన్నీ ఓడి అఫ్గాన్‌ ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. గురువారం జరిగిన పోరులో వెస్టిండీస్‌ 23 పరుగుల తేడాతో ఆ జట్టుపె విజయం సాధించింది. మొదట విండీస్‌ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ షై హోప్‌ (92 బంతుల్లో 77; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా, నికోలస్‌ పూరన్‌ (43 బంతుల్లో 58; 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. దౌలత్‌ జద్రాన్‌ 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్‌ 50 ఓవర్లలో 288 పరుగుల వద్ద ఆలౌటైంది. ఇక్రమ్‌ అలిఖిల్‌ (93 బంతుల్లో 86; 8 ఫోర్లు), రహ్మత్‌ షా (78 బంతుల్లో 62; 10 ఫోర్లు) రాణించాడు. బ్రాత్‌వైట్‌ 4 వికెట్లు తీశాడు.

సమష్టిగా రాణించిన బ్యాట్స్‌మెన్‌
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ జట్టులో ఓపెనర్‌ గేల్‌ (7) ఒక్కడే విఫలమయ్యాడు. మిగతావారంతా రాణించడంతో పాటు మూడు విలువైన భాగస్వామ్యాలు నమోదు చేయడంతో స్కోరు దూసుకెళ్లింది. లూయిస్‌ (78 బంతుల్లో 58; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), హోప్‌ కలిసి రెండో వికెట్‌కు 88 పరుగులు జోడించారు. తర్వాత హెట్‌మైర్‌తో కలిసి హోప్‌ మూడో వికెట్‌కు 65 పరుగులు జత చేశారు. పూరన్, హోల్డర్‌ (34 బంతుల్లో 45; 1 ఫోర్, 4 సిక్స్‌లు) ధాటిగా ఆడి ఐదో వికెట్‌కు 105 పరుగులు జోడించడంతో స్కోరు 300 పరుగులు దాటింది. సయద్, నబీ, రషీద్‌ఖాన్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

పోరాడిన ఇక్రమ్‌
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కెప్టెన్‌ నైబ్‌ (5) వికెట్‌ పారేసుకున్న అఫ్గాన్‌ను రహ్మత్‌ షా, ఇక్రమ్‌ జోడీ నిలబెట్టింది. ఇద్దరు కలిసి రెండో వికెట్‌కు 133 పరుగులు జోడించడం ప్రత్యర్థి శిబిరాన్ని ఆత్మరక్షణలో పడేసింది. ఇద్దరు విండీస్‌ బౌలర్లను అద్భుతంగా ఎదుర్కొన్నారు. తర్వాత ఇక్రమ్‌కు జతయిన నజీబుల్లా కూడా మెరుగ్గా ఆడటంతో విండీస్‌కు కష్టాలు తప్పలేదు. అయితే గేల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 36వ ఓవర్‌ మ్యాచ్‌ను మార్చేసింది. ఇక్రమ్‌ వికెట్ల ముందు దొరికిపోగా, నజీబుల్లా (31) రనౌటయ్యాడు. కాసేపటికే నబీ (2) కూడా ఔట్‌ కావడంతో అఫ్గాన్‌ పరాజయం ఖాయమైనా... అస్గర్‌ (32 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్‌), సయద్‌ (17 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించడంతో ఆఖరి బంతిదాకా అఫ్గాన్‌ ఆడింది.

స్కోరు వివరాలు
వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: గేల్‌ (సి) ఇక్రమ్‌ (బి) దౌలత్‌ 7; లూయిస్‌ (సి) నబీ (బి) రషీద్‌ఖాన్‌ 58; షైహోప్‌ (సి)రషీద్‌ఖాన్‌ (బి) నబీ 77; హెట్‌మైర్‌ (సి) సబ్‌– నూర్‌ అలీ (బి) దౌలత్‌ 39; పూరన్‌ రనౌట్‌ 58; హోల్డర్‌ (సి) దౌలత్‌ (బి) సయద్‌ 45; బ్రాత్‌వైట్‌ నాటౌట్‌ 14; అలెన్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 311.

వికెట్ల పతనం: 1–21, 2–109, 3–174, 4–192, 5–297, 6–297.

బౌలింగ్‌: ముజీబ్‌ 10–0–52–0, దౌలత్‌ 9–1–73–2, సయద్‌ 8–0–56–1, నైబ్‌ 3–0–18–0, నబీ 10–0–56–1, రషీద్‌ఖాన్‌ 10–0–52–1.

అఫ్గానిస్తాన్‌ ఇన్నింగ్స్‌: నైబ్‌ (సి) లూయిస్‌ (బి) రోచ్‌ 5; రహ్మత్‌ షా (సి) గేల్‌ (బి) బ్రాత్‌వైట్‌ 62; ఇక్రమ్‌ ఎల్బీడబ్ల్యూ (బి) గేల్‌ 86; నజీబుల్లా రనౌట్‌ 31; అస్గర్‌ (సి) హోల్డర్‌ (బి) బ్రాత్‌వైట్‌ 40; నబీ (సి) అలెన్‌ (బి) రోచ్‌ 2; సమీవుల్లా (సి) హెట్‌మైర్‌ (బి) రోచ్‌ 6; రషీద్‌ ఖాన్‌ (సి) హోల్డర్‌ (బి) బ్రాత్‌వైట్‌ 9; దౌలత్‌ (సి) కాట్రెల్‌ (బి) బ్రాత్‌వైట్‌ 1; సయద్‌ (సి) అలెన్‌ (బి) థామస్‌ 25; ముజీబ్‌ నాటౌట్‌ 7; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్‌) 288.

వికెట్ల పతనం: 1–5, 2–138, 3–189, 4–194, 5–201, 6–227, 7–244, 8–255, 9–260, 10–288.

బౌలింగ్‌: కాట్రెల్‌ 7–0–43–0, రోచ్‌ 10–2–37–3, థామస్‌ 7–0–43–1, హోల్డర్‌ 8–0–46–0, అలెన్‌ 3–0–26–0, బ్రాత్‌వైట్‌ 9–0–63–4, గేల్‌ 6–0–28–1.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement