ప్రపంచ కప్‌లో ఓటమి లేకుండా అజేయంగా సాగుతున్న భారత జట్టు ద్వితీయార్ధ పోరుకు సన్నద్ధమైంది. టోర్నీ ఆరంభం నుంచి 28 రోజుల వ్యవధిలో ఐదు మ్యాచ్‌లే పూర్తి చేసుకున్న టీమిండియా... రాబోయే పది రోజుల్లో నాలుగు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగబోతోంది. ఈ క్రమంలో వెస్టిండీస్ తొలి ప్రత్యర్థిగా భారత్ ముందు నిలిచింది. బలాబలాలు, ఫామ్ దృష్ట్యా విండీస్‌కంటే టీమిండియా ఎంతో మెరుగ్గా కనిపిస్తుండగా... తమదైన రోజున చెలరేగితే ఆ జట్టు నుంచి కూడా గట్టి పోటీ తప్పకపోవచ్చు. మిగిలిన మూడు మ్యాచ్‌లు గెలిస్తే తప్ప వరల్డ్‌కప్‌లో ముందుకెళ్లడంపై ఆశలు పెట్టుకోలేని స్థితిలో విండీస్ ఉండగా... ఈ మ్యాచ్‌లో గెలిస్తే కోహ్లి సేన సెమీస్‌కు దాదాపుగా చేరువవుతుంది.
మాంచెస్టర్: మెగా టోర్నీలో దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, ఆస్ట్రేలియాలపై సాధించిన సాధికారిక విజయాలు భారత్ ఆధిపత్యాన్ని చూపాయి. అయితే అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ ఒక్కసారిగా జట్టులో కొత్త లోపాలను చూపించింది. వాటిని సరిదిద్దుకొని ముందుకెళ్లే క్రమంలో మరో కీలక మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఇక్కడి ఓల్డ్‌ట్రఫోర్డ్ మైదానంలో నేడు జరిగే తమ ఆరో లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో టీమిండియా తలపడుతుంది. టోర్నీలో ఇప్పటి వరకు ఒకే మ్యాచ్ గెలిచిన విండీస్ ఈ సారైనా మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని భావిస్తోంది.
ధోని ఎలా ఆడతాడో!
సాధారణంగా వ్యక్తిగతంగా ఆటగాళ్లను విమర్శించడాన్ని ఇష్టపడని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా అఫ్గాన్‌తో మ్యాచ్‌లో ధోని బ్యాటింగ్‌ను తప్పుపట్టాడు. వాస్తవంగా కూడా గత మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ మిడిలార్డర్‌లో ఆడిన తీరు జట్టును ఆందోళన కలిగించేదే. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ధోని బ్యాటింగ్‌పైనే ఉంటుందనడంలో సందేహం లేదు. ఇది మినహా టీమిండియా జట్టు కూర్పు విషయంలో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కనిపించడం లేదు. రోహిత్, రాహుల్, కోహ్లిలతో టాపార్డర్ పటిష్టంగా ఉండగా... విజయ్ శంకర్ మరోసారి నాలుగో స్థానంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.
అఫ్గాన్‌పై అర్ధ సెంచరీ సాధించిన కేదార్ జాదవ్ కూడా కీలక పాత్ర పోషించాల్సి ఉంది. నలుగురు రెగ్యులర్ బౌలర్లతో గత పోరులో భారత బ్యాటింగ్ కొంత బలహీనంగా కనిపించింది. ఈ నేపథ్యంలో ఇద్దరు స్పిన్నర్లలో జడేజాను ఆడించే అవకాశం కూడా కనిపిస్తోంది. భువనేశ్వర్ గాయం కారణంగా జట్టులోకి వచ్చిన షమీ హ్యాట్రిక్ ప్రదర్శనతో తన చోటు ఖాయం చేసుకున్నాడు. గాయం నుంచి కోలుకొని భువీ ఈ మ్యాచ్ కోసం సుదీర్ఘంగా ప్రాక్టీస్ చేసినా... ఇప్పటికిప్పుడు షమీని తప్పించకపోవచ్చు. బుమ్రా మరోసారి పదునైన ఆరంభం ఇస్తే విండీస్‌ను దెబ్బ తీయడం భారత్‌కు కష్టం కాదు.
బ్రాత్‌వైట్ మళ్లీ చెలరేగితే...
కివీస్‌తో మ్యాచ్‌లో విండీస్ దురదృష్టవశాత్తూ మంచి విజయావకాశాన్ని చేజార్చుకుంది. అయితే విండీస్ బ్యాటింగ్ లోతు ఎలాంటిదో ఈ మ్యాచ్ చూపిం చింది. వరుసగా విధ్వంసక ఆటగాళ్లు ఉన్న ఆ జట్టు సమష్టిగా చెలరేగితే ఆపడం ఎవరి తరం కాదు. మధ్యలో కొన్ని మ్యాచ్‌లు విఫలమైనా... గేల్ దూకుడు గురించి భారత్‌కు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. హోప్, హెట్‌మైర్ తమపై ఉన్న అంచనాలకు తగినట్లుగా రాణించాల్సి ఉంది. హెట్‌మైర్‌కు స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోగల నైపుణ్యం ఉంది. గత మ్యాచ్ హీరో బ్రాత్‌వైట్ తన జోరు కొనసాగిస్తే టీమిండియాకు కష్టాలు తప్పవు. ఈ ప్రపంచకప్‌లో వెస్టిండీస్ పదునైన పేస్ బౌలింగ్ కూడా చెప్పుకోదగ్గ అంశం. ముఖ్యంగా కాట్రెల్ ప్రతీ జట్టుపై చెలరేగిపోయాడు. ఆరంభంలో అతని లెఫ్టార్మ్ పేస్‌ను ఎదుర్కోవడం భారత ఓపెనర్లకు అంత సులువు కాదు. ఈ విషయంలో రోహిత్ తరచుగా విఫలమయ్యాడు.
తుది జట్లు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, రాహుల్, విజయ్ శంకర్, ధోని, జాదవ్, పాండ్యా, కుల్దీప్, చహల్/ జడేజా, షమీ, బుమ్రా.
వెస్టిండీస్: హోల్డర్ (కెప్టెన్), గేల్, లూయిస్, హోప్, పూరన్, హెట్‌మైర్, బ్రాత్‌వైట్, నర్స్, రోచ్, కాట్రెల్, థామస్.
పిచ్, వాతావరణం
ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానం బ్యాటింగ్‌కు అనుకూలం. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. భారత్ ఇదే వేదికపై ఇప్పటికే పాక్‌తో ఆడగా... విండీస్ కూడా న్యూజిలాండ్‌ను ఇక్కడే ఎదుర్కొంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు.
ముఖాముఖి రికార్డు
భారత్, వెస్టిండీస్ జట్లు ఇప్పటివరకు 126 వన్డేల్లో తలపడ్డాయి. 59 మ్యాచ్‌ల్లో భారత్... 62 మ్యాచ్‌ల్లో వెస్టిండీస్ విజయం సాధించాయి. రెండు మ్యాచ్‌లు ‘టై’గా ముగిశాయి. మూడు మ్యాచ్‌లు రద్దయ్యాయి. ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు ఎనిమిది మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఐదు మ్యాచ్‌ల్లో భారత్, మూడు మ్యాచ్‌ల్లో విండీస్ గెలిచాయి. ప్రపంచకప్‌లో చివరిసారి 1992లో భారత్‌పై విండీస్ గెలిచింది. 1996, 2011, 2015 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో భారత్‌ను విజయం వరించింది.
ఎమ్మెస్కే కీపింగ్ చేయగా...
విండీస్‌తో మ్యాచ్‌కు ముందు రోజు భారత ఆటగాళ్ల ప్రాక్టీస్ జోరుగా సాగింది. ముఖ్యంగా గాయం నుంచి కోలుకున్న పేసర్ భువనేశ్వర్ కుమార్ నిర్విరామంగా బౌలింగ్ చేస్తూ ఫిట్‌గా కనిపించాడు. అతను ‘సింగిల్ వికెట్’ బౌలింగ్ చేస్తున్న సమయంలో భారత మాజీ కీపర్, సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ కీపర్‌గా వ్యవహరించడం విశేషం. ఆ తర్వాత కూడా భారత ఆటగాళ్లతో ప్రసాద్ ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేయించడం విశేషం. రిజర్వ్ కీపర్ పంత్ కూడా చాలా సేపు ఫీల్డింగ్ చేశాడు. మరో వైపు ఎమ్మెస్ ధోని స్పిన్నర్ల బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేశాడు. ముఖ్యంగా అతను స్వీప్ షాట్లు ఆడటంపైనే ఎక్కువగా దృష్టి పెట్టాడు. గత మ్యాచ్‌లో అఫ్గాన్ స్పిన్‌ను ఎదుర్కోవడంలోనే ధోని బాగా ఇబ్బంది పడిన విషయం గమనార్హం.
కోహ్లి అన్ని ఫార్మాట్‌లలో వరల్డ్ నంబర్‌వన్ బ్యాట్స్‌మన్. ధోని స్ట్రయిక్‌రేట్‌ను కోహ్లితో పోల్చడం సరైంది కాదు. కాబట్టి ధోని ఆటను మరెవరితోనూ పోల్చవద్దు. మేం ఆ మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యాన్ని కూడా కాపాడుకున్నాం. ధోని పరిస్థితులను బట్టి ఆడతాడు. కాబట్టి అతని బ్యాటింగ్ గురించి ఆందోళన అనవసరం. ధోని ఒక్కడితోనే కాదు కోచ్‌లు, సహాయక సిబ్బంది ఇతర బ్యాట్స్‌మెన్ అందరితో కూడా వారి ఆటపై చర్చిస్తూనే ఉంటాం.
– భరత్ అరుణ్, భారత బౌలింగ్ కోచ్
50: హార్దిక్ పాండ్యాకు ఇది 50వ మ్యాచ్. మరో 2 వికెట్లు తీస్తే అతని 50 వికెట్లు పూర్తవుతాయి.
59: గేల్ మరో 59 పరుగులు చేస్తే విండీస్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా లారాను అధిగమిస్తాడు.
జైత్రయాత్ర కొనసాగాలని...
Published Thu, Jun 27 2019 6:17 AM | Last Updated on Thu, Jun 27 2019 8:08 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment